Photo Credit: Twitter
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా గంభీర్ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను, సుదీర్ఘ బ్యాటింగ్ లైనప్ కలిగిన ప్లేయర్లను ఆడిస్తున్నప్పటికీ, ఈ విధానం జట్టకు నష్టం కలిగిస్తోందనే భావన కలుగుతుందని స్పష్టం చేశారు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి సారిస్తూ జట్టు కూర్పు విషయంలో గంభీర్ అనుసరిస్తున్న పద్దతులు తప్పుల తకడగా ఉన్నాయని అభివర్ణించారు.
జట్టులో నలుగురు ప్రధాన బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు కచ్చితంగా ఉండాలని, కానీ గంభీర్ మాత్రం బ్యాటింగ్‌కు ప్రాధాన్యమిస్తూ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎనిమిదికి పెంచడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ సిరీస్ ఒక గుణపాఠం లాంటిదని, ఈ సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మొదటిది ఏంటంటే, కనీసం నలుగురు రెగ్యులర్ బౌలర్లతో ఆడాలని తెలిపారు.
ఇక ఐదు, ఆరో బౌలర్‌గా సేవలందించేందుకు ఇద్దరు ఆల్‌రౌండర్లను ఆడిస్తే వాళ్లు బ్యాటింగ్‌లో కూడా ఉపయుక్తంగా ఉంటారన్నారు. ఉదాహరణకు బ్యాటింగ్ ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకున్న నమన్ ధీర్ లాంటి ఆటగాడు రెండు లేదా మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడని, అవసరమైనప్పుడు బ్యాట్‌తో రాణించగలడని విండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో నిరూపించాడని పేర్కొన్నారు.
మాజీ భారత బ్యాటర్ చతేశ్వర్ పుజారా సైతం బౌలింగ్ విభాగంపై స్పందించాడు. జట్టులో స్పిన్నర్ల ఎంపికపై స్పష్టత ఉండాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వాలని తెలిపాడు. మైదానంలో బౌండరీల దూరాన్ని బట్టి కుల్దీప్‌కు ప్రతిసారీ తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని పుజారా పేర్కొన్నాడు.
అయినప్పటికీ జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో తమకు స్థానం ఉందనే నమ్మకం ఆటగాళ్లకు కల్పించాలని చెప్పాడు. నాలుగు ఓవర్లలో 40-50 పరుగులు సమర్పించుకున్నంత మాత్రాన స్పిన్నర్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టు యాజమాన్యం అండగా నిలవాలని సూచించాడు. రాబోయే రెండేళ్లలో ఎవరిని ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలని పుజారా అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:
జింబాబ్వేపై సిరీస్ విజయం.. అసంతృప్తితో రగిలిన మంధాన!


