శ్రీలంక సంచ‌ల‌న విజ‌యం.. 430 టార్గెట్ హాంఫ‌ట్‌ | Sri Lanka Pulls Off Second-Highest ODI Run-Chase Ever Against England | Sakshi
Sakshi News home page

ENG vs SL: శ్రీలంక సంచ‌ల‌న విజ‌యం.. 430 టార్గెట్ హాంఫ‌ట్‌

Oct 22 2026 10:07 PM | Updated on Oct 22 2026 10:07 PM

Sri Lanka Pulls Off Second-Highest ODI Run-Chase Ever Against England

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా రావాల్పిండి వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 430 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని శ్రీలంక చేధించి చ‌రిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఇది రెండో అత్య‌ధిక విజ‌యవంత ర‌న్ చేజ్ కావ‌డం విశేషం. అయితే శ్రీలంక‌కు మాత్రం ఇదే హైయిస్ట్ ఛేజింగ్‌.

చెల‌రేగిన లంక బ్యాట‌ర్లు
భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఆరంభంలోనే శ్రీలంక‌కు భారీ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ క‌మిందు మెండిస్‌(18)తో పాటు కెప్టెన్ కుశాల్ మెండిస్‌(0) వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు. ఈ సమయంలో మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(97), యువ ఆటగాడు పవన్ రత్నాయకే(106 బంతుల్లో 130) ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. అవిష్కా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ దాసున్ షనకా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 97 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పవన్‌, శనక ఔటయ్యాక జట్టును నడిపించే బాధ్యతను జనిత్ లియానగే(27 బంతుల్లో 61) తీసుకున్నాడు. అయితే జోష్‌ టంగ్‌ వేసిన చివరి ఓవర్‌లో లంక విజయానికి కేవలం 8 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. దీంతో శ్రీలంక ఈజీగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.

తొలి బంతికి లియానగే సింగిల్‌ తీసి దునిత్ వెల్లలాగేకు స్ట్రైక్‌ ఇచ్చాడు. అయితే వరుసగా శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వైపు మలుపు తిరిగింది. క్రీజులోకి వచ్చిన అషితా ఫెర్నాండ్‌ సింగిల్‌ తీసి లియానగేకు స్ట్రైక్‌ ఇచ్చాడు. చివరి రెండు బంతుల్లో లంక విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. లియానగే భారీ సిక్సర్‌ బాది జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.

బ్రూక్ డబుల్ సెంచరీ
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.  ఓవరాల్‌గా 116 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌.. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు విల్‌ జాక్స్‌(66), జో రూట్‌(69), టామ్‌ బాంటన్‌(50) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. అయినప్పటికి ఇంగ్లండ్ ఓడిపోవడంతో బ్రూక్ ద్విశతకం వృథా అయిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement