PC: England Cricket X
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్డే కెరీర్‌లో తొలిసారి ద్విశతకం సాధించాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్లు బాది ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే, వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి.. అదే విధంగా డబుల్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయిన తొలి ప్లేయర్‌గా బ్రూక్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
4 వికెట్ల నష్టానికి 429 పరుగులు
కాగా పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక పాల్గొంటున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. రావల్పిండి వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది.
114 బంతుల్లోనే డబుల్ సెంచరీ
కెప్టెన్ హ్యారీ బ్రూక్ 114 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (117 బంతుల్లో; వెస్టిండీస్‌పై 2026లో) పేరిట ఉన్న రికార్డును బ్రూక్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా... ఓవరాల్‌గా ‘ద్విశతకం’ సాధించిన 11వ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు.
మిగిలిన వారిలో విల్ జాక్స్ (30 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), జో రూట్ (69; 8 ఫోర్లు), టామ్ బాంటన్ (50; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. జాక్స్‌తో కలిసి బ్రూక్ నాలుగో వికెట్‌కు 79 బంతుల్లోనే 185 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ తమ వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు నమోదు చేయగలిగింది.
75 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. బంతి వచ్చిందే తడువు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడి మరో 39 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు.
భారీ టార్గెట్‌ను ఊదేసిన శ్రీలంక
అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లకు 430 పరుగులు చేసి గెలిచింది. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లు కూడా హడలెత్తించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పవన్ రత్నాయకే (106 బంతుల్లో 130; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... దసున్ షనక (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), అవిష్క ఫెర్నాండో (83 బంతుల్లో 97; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకాలు చేజార్చుకున్నారు.
ఆఖర్లో జనిత్ లియనాగే (27 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు. ఇక వన్డేల్లో అత్యధిక ఛేదన రికార్డు దక్షిణాఫ్రికా (438/9; ఆస్ట్రేలియాపై 2006లో) పేరిట ఉండగా... భారత్ (406/2; వెస్టిండీస్‌పై 2026లో) పేరిట ఉన్న రెండో అతిపెద్ద లక్ష్య ఛేదన రికార్డును శ్రీలంక అధిగమించింది.
శ్రీలంకకు వన్డేల్లో ఇదే అతిపెద్ద ఛేదన. కాగా 2017లో కార్డిఫ్‌లో భారత్‌పై చేసిన 322 పరుగులే ఇప్పటి వరకు లంకకు అతిపెద్ద ఛేదన. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయిన క్రికెటర్లు
👉హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్): రావల్పిండి వేదికగా 2026లో శ్రీలంక మీద 202
👉చార్లెస్ కోవెంట్రీ (జింబాబ్వే): బులవాయో వేదికగా 2009లో బంగ్లాదేశ్ మీద 194*
👉ఫఖర్ జమాన్ (పాకిస్తాన్): జోబర్గ్ వేదికగా 2021లో సౌతాఫ్రికా మీద 193
👉జార్జ్ మున్సే (స్కాట్లాండ్): డుండే వేదికగా 2025లో నెదర్లాండ్స్ మీద 191
👉మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా): హామిల్టన్ వేదికగా 2007లో 181*.


