source: X
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ ఓ అరుదైన రికార్డు సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైనా, ఆట మొదలుకాకముందే ఇరు జట్లు వందేళ్ల నాటి రికార్డును సమం చేశాయి.
ఈ మ్యాచ్లో ఆడుతున్న 22 మంది ఆటగాళ్లలో 19 మంది 30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే. ఇంత మంది వయసు పైబడిన వారు ఓ టెస్ట్ మ్యాచ్లో ఆడటం వందేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1926లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టులోనూ 19 మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడినవారు ఉన్నారు. ప్రస్తుత మ్యాచ్ ఆ రికార్డును సమం చేసింది.
ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో అత్యధికంగా 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు పాల్గొనడం 1926లోనే జరిగింది. ఆ ఏడాది నాటింగ్హామ్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో 20 మంది 30 ప్లస్ ఆటగాళ్లు ఉన్నారు.
తాజా మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టులోని 11 మంది ఆటగాళ్లూ 30 ఏళ్లు దాటిన వారు కాగా.. సౌతాఫ్రికా జట్టులో మాథ్యూ బ్రెట్జ్కే, వియాన్ ముల్డర్, మార్కో యాన్సెన్ మినహా మిగతా 8 మంది 30 ఏళ్లు పైబడిన వారే.
మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు బౌలర్ స్కాట్ బోలాండ్ ఆదిలోనే రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. 12.2 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 20-2గా ఉంది.
మార్క్రమ్ (11), బెడింగ్హమ్ (0) ఔట్ కాగా.. ఆకెర్మన్ (5), బవుమా (4) క్రీజ్లో ఉన్నారు. లంచ్ తర్వాత మరోసారి వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఇదీ చదవండి: ODI Tri Series: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం


