‘భార‌త్‌ను ఓడించినంత ప‌ని చేశాం; ఇది సిరీస్ గెలుపుతో స‌మానం’ | Shai-Hope-Explains-WI-Won-Vs IND-Success Does Not Necessarily Have-Series Wins | Sakshi
Sakshi News home page

‘భార‌త్‌ను ఓడించినంత ప‌ని చేశాం; ఇది సిరీస్ గెలుపుతో స‌మానం’

Oct 18 2026 9:35 AM | Updated on Oct 18 2026 9:36 AM

Shai-Hope-Explains-WI-Won-Vs IND-Success Does Not Necessarily Have-Series Wins

Photo Credit: Twitter

భారత్‌, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవ్వడం వల్ల ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో సంయుక్తంగా ట్రోఫీని అందుకున్నాయి. అయితే భారత గడ్డపై సిరీస్ గెలవడంలో కరీబియన్లు మరోసారి విఫలమయ్యారని విమర్శలు వస్తున్న వేళ వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షై హోప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

విజయాలను ఎప్పుడు ట్రోఫీలతో లెక్కగట్టకూడదని, టీ20 సిరీస్‌లో సొంతగడ్డపై బలమైన జట్టుగా పేరున్న టీమిండియాను ఢీకొట్టడమే గాక 2-2తో సిరీస్‌ను సమం చేసి వారిని ఓడించినంత పని చేశామని తెలిపాడు. ఇది తమకు సిరీస్ గెలుపుతో సమానమని హోప్ వ్యాఖ్యానించాడు. శనివారం బెంగళూరు వేదికగా జరిగిన ఐదో టీ20 వర్షార్పణం కావడంతో మ్యాచ్ రద్దయింది. 

ట్రోఫీ ప్రదానోత్సవం అనంతరం హోప్ మాట్లాడుతూ.. ‘‘భారత గడ్డపై గత 24 ఏళ్లకు పైగా మేము ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేదు. అలాంటిది ఈ పర్యటనలో సిరీస్ నిర్ణయాత్మక (చివరి) మ్యాచ్ ఆడేంత వరకు రావడం, గెలిచేందుకు బలమైన అవకాశాన్ని సృష్టించుకోవడం ఒక యూనిట్‌గా మా ఎదుగుదలను చూపిస్తోంది. విజయాన్ని ఎప్పుడూ కేవలం ట్రోఫీలు లేదా సిరీస్ గెలుపుతోనే కొలవలేము. 


Photo Credit: Twitter

ఈ సిరీస్ పొడుగునా మా ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాట పటిమ, జట్టుగా సాధించిన ప్రగతి నిజంగా అభినందనీయం. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కీమో పాల్, రోస్టన్ చేజ్.. డెత్ ఓవర్లలో షమర్ స్ప్రింగర్ అందించిన సహకారం సిరీస్‌ను సమం చేయడంలో ఎంతగానో తోడ్పడింది. మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు నాపై నాకు నమ్మకం ఉంటుంది. 

నా ఆట శైలి, ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేయను, వీలైనంత ప్రశాంతంగా ఉంటూ జట్టుకు విజయాన్ని అందించడానికే ప్రయత్నిస్తాను. టీ20ల్లో భారత్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించినంత పని చేశాం.. ఇది మాకు సిరీస్ గెలుపుతో సమానం’’ అని చెప్పుకొచ్చాడు.


Photo Credit: Twitter

ఇక విండీస్ కెప్టెన్ షై హోప్ భారత పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్డే, టీ20 సిరీస్‌లు కలిపి నాలుగు సెంచరీలు బాదిన హోప్.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డుతో పాటు మూడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డులు కూడా దక్కించుకోవడం విశేషం. ఐదు టీ20 మ్యాచ్‌లాడిన హోప్ నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 190కి పైగా స్ట్రై‍క్‌రేట్‌తో 261 పరుగులు సాధించాడు. 

ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అంతకముందు వన్డే సిరీస్‌లోనూ హోప్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లాడిన హోప్ 112 స్ట్రైక్‌రేట్‌తో 278 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement