
Kane Williamson Back To Net Session: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు శుభవార్త! కివీస్ పరిమిత ఓవర్ల సారథి కేన్ విలియమ్సన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది. మెగా ఈవెంట్ మొదలయ్యే నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2023 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మోకాలి నొప్పి కారణంగా
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అయితే, అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేన్ మామ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. నొప్పి తీవ్రతరం కావడంతో పదహారో ఎడిషన్ మొత్తానికి దూరమయ్యాడు. ఏప్రిల్ నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.
సర్జరీ తర్వాత ఇలా
ఈ నేపథ్యంలో.. మోకాలికి సర్జరీ చేయించుకున్న కేన్ మామ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. బ్యాట్ పట్టి నెట్ సెషన్‌లో పాల్గొన్న వీడియోను ఈ కివీస్ సారథి తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘‘బ్యాట్ పట్టుకుని తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్‌కు రావడం చాలా చాలా బాగుంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.
వరల్డ్‌కప్ నాటికి
కేన్ విలియమ్సన్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. త్వరలోనే అతడు మైదానంలో దిగడం ఖాయమంటూ అభిమానులు సంబరపడుతున్నారు. ప్రపంచకప్‌లో కేన్ మామ మెరుపులు చూడవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు న్యూజిలాండ్ యూఏఈ, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.
ఆగష్టు 17 నుంచి యూఏఈతో దుబాయ్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆగష్టు 30 నుంచి ఇంగ్లండ్‌తో 4 వన్డేలు, 4 టీ20ల సిరీస్ ఆడనుంది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టిమ్ సౌథీ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే.
యూఏఈతో సిరీస్‌కు:
టిమ్ సౌథీ (కెప్టెన్), ఆది అశోక్, చాడ్ బోవ్స్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, లాకీ ఫెర్గూసన్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జేమీసన్, కోల్ మెక్కాంచీ, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ షిప్లీ, విల్ యంగ్.
ఇంగ్లండ్ జట్టుతో సిరీస్‌కు:
టిమ్ సౌథీ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
చదవండి: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'