
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపుగా సగం మ్యాచ్‌లు ముగిసినందున, ఆయా జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్‌లపై కన్నేశాయి. ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఆరు జట్లు పోటీపడుతుంటే.. ఐదు సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు వరుస ఓటములతో వెనకంజలో ఉన్నాయి.
ఈ ఏడాదిలో సీజన్‌లో ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. దీంతో సెకెండ్ హాఫ్‌లో ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారనుంది. కేవలం విజయాలు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా టాప్-4 జట్లను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్‌ఆర్‌హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రతీ జట్టుకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం 10 జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్
ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ దుమ్ములేపుతోంది. గుజరాత్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
ఢిల్లీ సైతం 8 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే గుజరాత్(+1.104) కంటే రన్‌రేట్ పరంగా కాస్త వెనకబడి ఉండడంతో ఢిల్లీ( +0.657) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్ జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు.
ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్
ఈ ఏడాది సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా అదరగొడుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. అయితే గుజరాత్, ఢిల్లీ కంటే రన్‌రేట్‌పరంగా వెనకబడి ఉండడంతో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాలి.
మరోవైపు ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. . ఇందులో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ అండ్ పంజాబ్ కింగ్స్
ఈ ఏడాది సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. అదేవిధంగా సీజన్‌లో ఆరంభంలో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్ రన్‌రేట్(+0.212) కాస్త మెరుగ్గా ఉండడంతో వారి ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
రాజస్తాన్ రాయల్స్..
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటివరకు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. సన్‌రైజర్స్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు గెలిచినా రాజస్తాన్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్(-0.625) కూడా మెరుగ్గా లేదు.
ఎస్ఆర్‌హెచ్ అండ్ సీఎస్‌కే..
ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్దానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్‌హెచ్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు ఓడితే మాత్రం అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ నిష్క్రమిస్తోంది. మరోవైపు సీఎస్‌కే పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.