గురి తప్పిన భారత బాణం | Indian archers disappointed in third World Cup tournament | Sakshi
Sakshi News home page

గురి తప్పిన భారత బాణం

Jun 8 2025 2:05 AM | Updated on Jun 8 2025 2:05 AM

Indian archers disappointed in third World Cup tournament

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనక్కి  

అంటాల్యా (తుర్కియే): తొలి రెండు ప్రపంచకప్‌ టోర్నీలలో కలిపి మొత్తం 11 పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలు) సాధించిన భారత ఆర్చర్లు మూడో ప్రపంచకప్‌ టోర్నీలో మాత్రం నిరాశ పరిచారు. ఒక్క పతకం కూడా గెలవకుండానే రిక్తహస్తాలతో వెనక్కి వచ్చారు. మొత్తం 10 విభాగాల్లో పోటీలు జరగ్గా... ఒక్క విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాన్ని సాధించలేకపోయారు. శనివారం పురుషుల, మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం పోటీలు జరిగాయి. 

పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు తరుణ్‌దీప్‌ రాయ్, పార్థ్‌ సాలుంఖే తొలి రౌండ్‌లోనే ఓడిపోగా... పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్‌ (బెంగాల్‌) రెండో రౌండ్‌లో వెనుదిరిగారు. తరుణ్‌దీప్‌ రాయ్‌ 2–6 సెట్‌ పాయింట్లతో (28–30, 29–28, 27–31, 29–32) మథియాస్‌ క్రామెర్‌ (జర్మనీ) చేతిలో... పార్థ్‌ సాలుంఖే 2–6 సెట్‌ పాయింట్లతో (28–29, 25–28, 28–25, 27–30) లు షుయె (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. 

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ధీరజ్‌ 4–6 సెట్‌ పాయింట్లతో (30–30, 30–30, 31–30, 28–29, 28–30) టాంగ్‌ చి చున్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, అతాను దాస్‌ 4–6 సెట్‌ పాయింట్లతో (28–27, 30–31, 31–30, 30–31, 27–30) బ్రాడీ ఎలీసన్‌ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. అంతకుముందు తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ధీరజ్‌ 6–5 సెట్‌ పాయింట్లతో (29–26, 30–28, 26–27, 29–29, 27–29, 9–8) జాక్‌ విలియమ్స్‌ (అమెరికా)పై, అతాను దాస్‌ 6–0త సెట్‌ పాయింట్లతో (30–28, 29–28, 30–29) తొమత్సు దైసుకె (జపాన్‌)పై విజయం సాధించారు.  

మహిళల రికర్వ్‌ విభాగంలో అంకిత భగత్‌ తొలి రౌండ్‌లో, దీపిక కుమారి రెండో రౌండ్‌లో, సిమ్రన్‌జీత్‌ కౌర్‌ క్వార్టర్‌ ఫైనల్లో  నిష్క్రమించారు. అంకిత 2–6 సెట్‌ పాయింట్లతో (27–26, 26–28, 29–30, 28–29) దున్యా యెనిహయత్‌ (తుర్కియే) చేతిలో... దీపిక 0–6 సెట్‌ పాయింట్లతో (29–30, 27–28, 28–30) ఆన్‌ సాన్‌ (దక్షిణ కొరియా) చేతిలో... సిమ్రన్‌జీత్‌ 5–6 సెట్‌ పాయింట్లతో (29–28, 24–29, 27–24, 27–27, 23–29, 8–11) ఆన్‌ సాన్‌ చేతిలో ఓడిపోయారు.   

Advertisement
 
Advertisement
Advertisement