‘వాళ్లిద్దరితో పోల్చడం అతడు చేసుకున్న పుణ్యం’ | Gavaskar Praise-Bavuma-Dont-Have-PR Army-Like-2-Indian Great Cricketers | Sakshi
Sakshi News home page

‘వాళ్లిద్దరితో పోల్చడం అతడు చేసుకున్న పుణ్యం’

Oct 26 2026 9:26 AM | Updated on Oct 26 2026 9:27 AM

Gavaskar Praise-Bavuma-Dont-Have-PR Army-Like-2-Indian Great Cricketers

Photo Credit: Twitter

గెబెర్హా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 179 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎంత పెద్ద ఇన్నింగ్స్ ఆడినా టెంబా బవుమా మైదానంలో కంట్రోల్ తప్పడని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. 

ఇక తన గొప్పలు ప్రపంచానికి చెప్పుకునేందుకు ఇష్టపడడంటూ ఆకాశానికెత్తాడు. ఈ రెండు  విషయాల్లో భారత మాజీ క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్‌, అజింక్యా రహానేలతో బవుమాను పోల్చవచ్చని తెలిపాడు. మిడ్‌-డే కాలమ్‌లో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బవుమా ఎంపికైనప్పుడు, అతడి నియామక ప్రక్రియపై ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. టెస్టు కెప్టెన్‌గా అతడు పనికిరాడనే విమర్శలు పెరిగిపోయాయి. కానీ కాలం గడిచేకొద్ది కేవలం నాయకుడిగానే పరిమితం కాకుండా, బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో తనను అవమానించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 

సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా 14 టెస్టుల్లో 12 విజయాలు అందుకున్న బవుమా.. అతడి సారథ్యంలో జట్టు ఒక టెస్టు మాత్రమే ఓడిపోగా, మరో టెస్టు డ్రా చేసకుంది. కెప్టెన్‌గా రహానే కూడా భారత్ తరఫున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ విషయంలో మాత్రం అజింక్యా రహానేతో బవుమాను పోల్చవచ్చు. 

మరో విషయమేంటంటే.. ఈ ఇద్దరు గొప్పలు చెప్పుకోరు. అలాగే తాము ఎంత గొప్పవాళ్లమనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీళ్ల వద్ద ప్రచార బృందం (పీఆర్‌) కూడా లేదు. ఇక మైదానంలో బవుమా ప్రవర్తించే తీరు, ఆగ్రహం ప్రదర్శించకుండా ఓపికతో ఉండడం లాంటివి చూస్తే నా సహచరుడు గుండప్ప విశ్వనాథ్ గుర్తుకువస్తున్నాడు.  రహానే, గుండప్ప విశ్వనాథ్ వంటి గొప్ప ఆటగాళ్లతో పోల్చడం బవుమా చేసుకున్న అదృష్టం’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా 0-1తో వెనుకబడిన సౌతాఫ్రికా రెండో టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 425 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 

110/6తో కష్టాల్లో ఉన్నప్పుడు, బావుమా 179 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. అనంత‌రం ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 99 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 295 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌట్ కావ‌డంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య నిర్ణ‌యాత్మ‌క చివరి టెస్టు మ్యాచ్ అక్టోబ‌ర్ 27 నుంచి జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement