source: X
త్వరలో పాకిస్తాన్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ వ్యవహరించనుండగా.. సంచలన ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఎషాన్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అంజల బండారాకు కూడా జట్టులో అవకాశం కల్పించారు.
మరోవైపు, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా, ఓపెనర్లు లహిరు ఉదార, కమిల్ మిశారా, ఆల్‌రౌండర్ సహన్ ఆరాచ్చిగేను జట్టు నుంచి తప్పించారు. ఎడమచేతి వాటం పేసర్ దిల్షాన్ మధుశంక, ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన దినేశ్ చండీమల్ తిరిగి జట్టులోకి వచ్చారు.
పతుమ్ నిస్సంకకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తేనే పాకిస్తాన్ పర్యటనలో ఆడే అవకాశం ఉంటుంది. స్పిన్ విభాగంలో ప్రభాత్ జయసూర్య, కేశర నవంత ప్రధాన బాధ్యతలు చేపట్టనున్నారు. సోనల్ దినూష కూడా స్పిన్ బౌలింగ్‌లో జట్టుకు ఉపయోగపడనున్నాడు. పేస్ విభాగంలో మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, ఎషాన్ మలింగ, దిల్షాన్ మధుశంక ఉన్నారు.
తొలిసారి టెస్టు జట్టులో మలింగ
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంక తరఫున రాణిస్తున్న ఎషాన్ మలింగకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. 22 ఏళ్ల ఈ పేసర్ 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 31.15 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. ఎషాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా అదరగొట్టాడు.
వికెట్ కీపర్ అంజల బండారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 31 మ్యాచ్‌ల్లో 65.85 సగటుతో పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి.
కుసాల్ మెండిస్‌కు కెప్టెన్సీ
శ్రీలంక టెస్టు జట్టుకు కుసాల్ మెండిస్ నాయకత్వం వహించనున్నాడు. ధనంజయ డి సిల్వ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మెండిస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అతడికి కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్.
నవంబర్‌లో సిరీస్
పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు నవంబర్ 9 నుంచి 13 వరకు రావల్పిండిలో జరగనుంది. రెండో టెస్టు నవంబర్ 17 నుంచి 21 వరకు లాహోర్‌లో నిర్వహించనున్నారు. ఈ రెండు మ్యాచ్‌లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో విజయాలు సాధించి తమతమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పాక్‌తో టెస్ట్ సిరీస్‌కు లంక జట్టు
కుశాల్ మెండిస్ (కెప్టెన్), పతుమ్ నిస్సంక, పసిందు సూరియబండార, దినేశ్ చాందిమల్, కమిందు మెండిస్, సోనల్ దినూష, ధనంజయ డి సిల్వ, అంజల బండారా, కేశర నవంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఎషాన్ మలింగ.
ఇదీ చదవండి: చెన్నై పోలీసులకు సీఎస్‌కే భారీ కానుక


