మాకు కూడా కావాలన్న కోచ్‌లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? | Asia Cup 2023: Bangladesh, Sri Lanka Boards Breaks Silence On Ind Vs Pak Reserve Day | Sakshi
Sakshi News home page

Asia Cup: మిగిలిన 2 టీమ్‌లను వెనక్కి పంపిస్తే సరి! అదేం కాదు.. మా అంగీకారంతోనే.. ఇదేం తీరు?

Sep 9 2023 9:47 AM | Updated on Sep 9 2023 10:17 AM

Asia Cup: Bangladesh Sri Lanka Boards Break Silence On Ind Vs Pak Reserve Day - Sakshi

India-Pakistan Match Reserve Day: ఆసియా కప్‌ ‘సూపర్‌–4’ దశలో మిగతా నాలుగు మ్యాచ్‌లను కాదని ఒక్క భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కే రిజర్వ్‌ డే కేటాయించడం పట్ల అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ‘ఒక టోర్నమెంట్‌లో ఈ తరహా వివక్ష ఎక్కడా చూడలేదు. బరిలో ఉండే అన్ని టీమ్‌లు, మ్యాచ్‌లు సమానం అనే క్రీడాస్ఫూర్తిని మరచి ఇలాంటి ప్రత్యేక ఏర్పాటు ఏమిటి?

మిగిలిన మ్యాచ్‌లలో ఏవైనా వర్షం కారణంగా రద్దయి ఆయా టీమ్‌లు ఒక్క పాయింట్‌కే పరిమితం అయితే వారికి అన్యాయం చేసినట్లే కదా’ అని శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ వర్గాలు ప్రశ్నించాయి.

ఆ టీమ్‌లను వెనక్కి పంపండి
ఆసియా కప్‌ టెక్నికల్‌ కమిటీలో భాగమైన బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ అక్రమ్‌ ఖాన్‌... తమకు ఈ విషయమే తెలీదని, ఏసీసీ ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకుందని విమర్శించాడు. మిగిలిన రెండు టీమ్‌లను మ్యాచ్‌ ఆడకుండా వెనక్కి పంపించేస్తే సరి అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి.

మాకు కూడా కావాలన్న కోచ్‌లు
మరోవైపు తమ మ్యాచ్‌కు కూడా రిజర్వ్‌ డే ఉంటాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్‌ కోచ్‌ హతురసింఘే, శ్రీలంక కోచ్‌ సిల్వర్‌వుడ్‌ అభిప్రాయ పడ్డారు. ‘ఈ నిర్ణయం మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. నిజంగా వర్షం విషయంలో అలాంటి ఆలోచనే ఉంటే మా మ్యాచ్‌కు కూడా రిజర్వ్‌ డే ఉండాలి. కనీసం చర్చించే అవకాశం లేకుండా నిర్ణయం తీసుకోవడం ఏమిటి’ అని ఇరు జట్ల కోచ్‌లు వ్యాఖ్యానించారు.  

బంగ్లా, శ్రీలంక బోర్డుల స్పందన
అయితే, బంగ్లాదేశ్‌, శ్రీలంక క్రికెట్‌ బోర్డుల స్పందన మాత్రం భిన్నంగా ఉంది. పోటీలో ఉన్న నాలుగు జట్ల యాజమాన్యాలను సంప్రదించిన తర్వాతే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుందని ఇరు బోర్డులు స్పష్టం చేశాయి.

ఈ మేరకు.. ‘‘ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఆసియా కప్‌ సూపర్‌ 4 దశలో రిజర్వ్‌ డే నిర్ణయించారు. నాలుగు జట్ల అంగీకారంతోనే ఏసీసీ నిర్ణయం తీసుకుంది’’ అని బీసీబీ ట్వీట్‌ చేసింది. శ్రీలంక బోర్డు సైతం ఎక్స్‌ వేదికగా ఇదే తరహాలో వివరణ ఇచ్చింది. 

నేడు శ్రీలంక VS బంగ్లాదేశ్‌ 
ఆసియా కప్‌ ‘సూపర్‌–4’లో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. పాకిస్తాన్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో చిత్తయిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి.

మరోవైపు లంకకు ఇది తొలి మ్యాచ్‌. సొంతగడ్డపై ఆడుతున్న ఆ జట్టు విజయంతో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  

చదవండి: ‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్‌ స్పెషల్‌ విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌!

Advertisement
 
Advertisement
Advertisement