రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు

Published Tue, Mar 26 2024 8:00 AM

మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ - Sakshi

● బీఆర్‌ఎస్‌ పాలనలోనే ఖజానా ఖాళీ ● శ్వేత పత్రాల ద్వారా బహిర్గతం ● మంత్రి పొన్నం ప్రభాకర్‌ ● 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా

జహీరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించి ఖజానా ఖాళీ చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికల కు ముందు తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని అన్నారు. సోమ వారం మహారాష్ట్రలోని గాణుగాపూర్‌లో దైవ దర్శ నం చేసుకుని హైదరాబాద్‌ వెళుతూ జహీరాబాద్‌లో ఆగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ హయాంలో 10 సంవత్సరాల్లో ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేసిందో శ్వేతపత్రాల ద్వారా ప్రజానికానికి చూపామన్నారు. కొత్త సర్కారు ఏర్పడి నెల రోజులు కాక ముందు నుంచే బీఆర్‌ఎస్‌ నేతలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, హామీలు అమలు కావడం లేదని శాపనార్థాలు పెడ్తున్నారన్నారు. అధికారాన్ని కోల్పోయిన బాధలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రూ.500కే సిలిండర్‌, విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అమలు ప్రక్రియ, రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే తెలియని ఎంపీ బీబీ పాటిల్‌ను బీఆర్‌ఎస్‌ నుంచి దిగుమతి చేసుకుని బీజేపీ జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ తమతో కలిసి పోరాడారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్న విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నేడు రాజకీయ డ్రామా ఆడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థికి ఈ ప్రాంతంతో సంబంధమేలేదన్నారు. నియోజకవర్గం పట్ల అవగాహన, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అవసరం ఉందన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement