ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ లేఖ | Local Body Elections: Ysrcp Letter To Election Commission | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ లేఖ

Oct 14 2026 9:42 PM | Updated on Oct 14 2026 9:42 PM

Local Body Elections: Ysrcp Letter To Election Commission

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులపై నమోదైన/పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించేందుకు పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.

ఇందులో ఆయన కూటమి సర్కార్ పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ ఆశావహ అభ్యర్ధులపై చేస్తున్న వేధింపుల్ని ప్రస్తావించారు. వాటిని అడ్డుకోవడంతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు అవసరమైన వివరాలు అందించేందుకు రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆశావహ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వేధిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేకపోయినా, వివిధ పోలీస్ స్టేషన్లలో తమ పార్టీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

ఇలాంటి చర్యలు వారిలో భయాందోళనలు సృష్టించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో వారు పాల్గొనడానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తమపై కేసులు ఎక్కడ నమోదు అయ్యాయో, ఏ పోలీస్ స్టేషన్‌లో లేదా ఏ జిల్లాలో కేసులు నమోదయ్యాయో కూడా అనేక మంది ఆశావహ అభ్యర్థులకు తెలియజేయడం లేదన్నారు. ఫలితంగా, సంబంధిత సమాచారాన్ని పొందడానికి వారు ఏ అధికారులను సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీంతో నామినేషన్ పత్రాల్లో కేసులకు సంబంధించిన పూర్తి, కచ్చితమైన వివరాలను సమర్పించడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్ఈసీకి రాసిన లేఖలో వెల్లడించారు.

తమపై నమోదైన కేసుల వివరాలు, నమోదైన ప్రదేశాలు తెలియకపోవడం వల్ల అభ్యర్థులు ఎన్నికల్లో నష్టపోకుండా చూడాలని ఎన్నికల కమిషన్ ను లేళ్ల అప్పిరెడ్డి కోరారు. నేరాలు, నేరస్థుల రికార్డులను తెలుసుకోవడానికి పోలీసు శాఖ వద్ద ఇప్పటికే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉందని, దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారని తెలిపారు.

CCTNS ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని సంబంధిత రికార్డులను తెలుసుకోవచ్చని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.  అవసరమైన సందర్భాల్లో సంబంధిత జిల్లా లేదా పోలీసు విభాగంతో సమన్వయం చేసుకుంటూ, అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు ప్రతి కేసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పేరు, క్రైమ్ నంబర్, సంవత్సరం, వర్తించే చట్టపరమైన సెక్షన్లు, ప్రస్తుత దర్యాప్తు స్థితి, తుది నివేదిక/ఛార్జిషీట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్ర, ధృవీకృత ప్రకటనను లిఖితపూర్వకంగా అందించాలని కోరారు.

ఒక కేసు నమోదు కావడం మాత్రమే నేరం చేసినట్లు నిర్ధారించదని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనాలని కూడా అప్పిరెడ్డి కోరారు. అలాగే శోధనలో తగిన రికార్డు ఏదీ లభించకపోతే, ఆ రికార్డుల్లో ఎటువంటి సమాచారం లభించలేదని లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. డేటాబేస్‌లోని వివరాలు అసంపూర్ణంగా ఉన్నా, ఆలస్యంగా అందుబాటులోకి వచ్చినా లేదా అదనపు ధ్రువీకరణ అవసరమైనా, ఆ ప్రకటనకు ముందు సంబంధిత విభాగాలతో పోలీసులు పూర్తి సమాచారం నిర్ధారించుకోవాలన్నారు. అందువల్ల, ఈ సౌకర్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా అమలు చేయడానికి డీజీపీ, అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ఒక ఆశావహ అభ్యర్థి గుర్తింపు ధ్రువీకరణ కోసం అవసరమైన గుర్తింపు పత్రాలతో స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పైన పేర్కొన్న సమగ్ర, ధ్రువీకరించిన సమాచారాన్ని పోలీసులు అందించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రికార్డుల్లో ఎటువంటి కేసులూ గుర్తించకపోతే, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తులను స్వీకరించినట్లు గుర్తింపు ఇవ్వడంతో పాటు, నామినేషన్ గడువుకు తగినంత ముందుగా, నిర్ణీత సమయవ్యవధిలో సమాచారాన్ని అందించాలని కోరారు.

ఈ విధానం సురక్షితంగా ఉండటంతోపాటు, అభ్యర్థులందరికీ సమానంగా అందుబాటులో ఉండాలన్నారు.  పోలీసులు దరఖాస్తులను స్వీకరించినట్లు అక్ నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వాలని కోరారు.  నామినేషన్ గడువుకు తగినంత ముందుగా, నిర్ణీత స్వల్ప వ్యవధిలో ఈ సమాచారాన్ని అందించాలని ఎస్ఈసీని కోరారు.

అదే విధంగా, అభ్యర్థులు వేర్వేరు పోలీస్ స్టేషన్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా, డీజీపీ ఒక నోడల్ అధికారిని నియమించి, ప్రామాణిక దరఖాస్తు ఫారం, సమాధాన ఫారాన్ని జారీ చేసేలా ఎన్నికల సంఘం ఆదేశించాలని కోరారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా అందుబాటులో ఉంచాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరారు. అలాగే ఈ లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా పంపారు.

ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement