జెండా సభలో జనం లేక ‘జంట’ షాక్‌ | Sakshi
Sakshi News home page

జెండా సభలో జనం లేక ‘జంట’ షాక్‌

Published Fri, Mar 1 2024 4:39 AM

The first meeting organized jointly by TDP Janasena was utter flop - Sakshi

జెండా సభకో దండం అంటూ ముఖం చాటేసిన కేడర్‌

తొలి అడుగులోనే టీడీపీ–జనసేనకు అసమ్మతి పిడుగు

ఊదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40–50 వేలలోపే

జనం లేక ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్‌ చిర్రుబుర్రులు

ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్‌ను దూషించడంలో పోటాపోటీ

తొలి సభే అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైరాశ్యం

వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌

ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతి పెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు సిద్ధం సభ

ఎన్నికల్లో మరోసారి ‘ఫ్యాన్‌’ ప్రభంజనానికి సంకేతంగా నిలిచిన మూడో సభ

వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని తేల్చిచెప్పిన డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలు

సాక్షి, అమరావతి: రహస్య అజెండాతో ఐదేళ్లుగా ముసుగులో గుద్దులాట.. బేరసారాల అనంతరం ప్రకటించిన టీడీపీ – జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోనే బెడిసికొట్టింది! పొత్తులు కుదిరాక తొలిసారిగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా సభ’ జనం లేక వెలవెలబోయింది. పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, కేడర్‌ ఈ సభను బహిష్కరించి దూరంగా ఉండటం గమనార్హం.

ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు ఐదారు లక్షల మంది తరలివస్తారంటూ రెండు పార్టీల అగ్రనేతలు ఎంతో నమ్మకం పెట్టుకోగా కేవలం 40 వేల నుంచి 50 వేల మంది లోపే హాజరైనట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనం లేక సభా ప్రాంగణం కళ తప్పడంతో ఇరు పక్షాల నేతలపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చిర్రుబుర్రులాడారు. తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన వారిద్దరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా సీఎం జగన్‌పై పోటీ పడి దూషణలకు దిగడం ఇరు పక్షాల శ్రేణులను విస్మయానికి గురి చేసింది.  ‘గూడెం’ దెబ్బకు గుండె గుభేల్‌
ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభే అట్టర్‌ ప్లాప్‌ కావడంతో టీడీపీ–జనసైన శ్రేణులు నైతిక స్థైరాన్ని కోల్పోయాయి. దీంతో ఎన్నికలకు ముందే కాడి పారేసే దిశగా కదులుతున్నాయి. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతోపాటు ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయమని జీ న్యూస్‌ మ్యాటరైజ్, జనాధార్‌ ఇండియా, టైమ్స్‌ నౌ లాంటి డజనకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహంతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి.

పొత్తు ఆదిలోనే ‘చిత్తు’..
పొత్తులో భాగంగా 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలను జనసేనకు కేటాయించాక కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో సభను నిర్వహించడం ద్వారా బలం చాటుకోవాలని తాడేపల్లిగూడెంను వేదికగా ఎంచుకున్నారు. అయితే అవకాశవాద పొత్తును ప్రజలు ఆదిలోనే చిత్తు చేశారనేందుకు ఆ సభ వెలవెలబోవడమే నిదర్శనమని పేర్కొంటున్నారు. 2014లో జనసేనను స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు నష్టం జరుగుతుందని చంద్రబాబు వారించడంతో పోటీకి దూరంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు.

నాడు టీడీపీ–బీజేపీ కూటమిలో చేరి చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి నుంచి వేరుపడ్డ పవన్‌ బీఎస్పీ–సీపీఐతో జతకట్టి పోటీ చేశారు. ఇప్పుడు చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా మళ్లీ టీడీపీతో జత కలిశారు. వీటిని పరిశీలిస్తున్న ప్రజలు చంద్రబాబు కోసం.. చంద్రబాబు చేత.. చంద్రబాబే ఏర్పాటు చేయించిన పార్టీ జనసేన అని భావిస్తున్నారు. 

ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల దూకుడు..:
సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తూ సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభలను తొలుత భీమిలిలో ఆ తర్వాత దెందులూరులో నిర్వహించారు. ఆ రెండు సభలకు సముద్రాన్ని తలపించే రీతిలో జనం కదలి వచ్చారు. ఇక ఈనెల 18న రాప్తాడులో నిర్వహించిన మూడో ‘సిద్ధం’ సభకు 10–11 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచిపోయింది. సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీకగా రాప్తాడు సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేయడం, పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లను పారదర్శకంగా అందించడం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తేవడంతో సీఎం జగన్‌పై విశ్వాసం ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నాడిని గుర్తించేందుకు పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది.

♦  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 0–1 స్థానంలో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని టైమ్స్‌నౌ సర్వే తేల్చింది. 

♦ రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకుగానూ 19 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయభేరీ మోగిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితం అవుతుందని జీన్యూస్‌ మ్యాటరైజ్‌ సర్వే స్పష్టం చేసింది.

♦  49.2 శాతం ఓట్లతో 125 శాసనసభ, 17 లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 46.3 శాతం ఓట్లతో 50 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని జనాధార్‌ ఇండియా సర్వే వెల్లడించింది. 62 శాతం మంది ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. 

Advertisement
Advertisement