రూ.2 కోట్లతో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక బస్సు | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్లతో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక బస్సు

Published Thu, Nov 16 2023 1:48 AM

విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి, చిత్రంలో ఎమ్మెల్యే సింహాద్రి  - Sakshi

అవనిగడ్డ: దివిసీమలో క్యాన్సర్‌ నిర్ధారణ ఉచిత పరీక్షల కోసం రూ.2 కోట్లు సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయనున్నట్టు మచిలీ పట్నం పార్లమెంట్‌ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. అవనిగడ్డలో మంగళవారం సామాజిక భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దివిసీమలో ఎక్కువగా క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఈ బస్సు ఉపయోగపడుతుందన్నారు. గ్రామ గ్రామాన ఈ సేవలు అందించేందుకు అతి త్వరలోనే బస్సు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ బస్సులో ఖరీదైన పరీక్షలు సైతం ఉచితంగా చేస్తారన్నారు.

రూ.4 కోట్లతో మత్స్యకారులకు

జెట్టీలు, బోట్లు

కృత్తివెన్ను నుంచి నాగాయలంక వరకూ తీర ప్రాంత మత్స్యకారులకు ఉపయోగపడేలా రూ.4 కోట్ల వ్యయంతో జెట్టీలు, ఫ్లాట్‌ఫారాలు, ఉచిత బోట్లను అందించే కార్యక్రమాన్ని అతి త్వరలోనే చేపడతామని ఎంపీ బాలశౌరి వెల్లడించారు. జలాశయాల్లో సాగునీరు లేకున్నా తీర ప్రాంత భూములకు 95 శాతం సాగునీరందించేలా కృషి చేశామన్నారు. మచిలీపట్నం పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, పోర్టుకు అనుబంధంగా ప్రత్యేక పరిశ్రమలు పెట్టుకునేందుకు యువత ముందుకొస్తే బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎంపీ చెప్పారు. మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో రూ.1.75 కోట్లతో ఎమ్మారై స్కానింగ్‌ ఏర్పాటు చేశామని, జిల్లాలో ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ గొర్రుముచ్చు ఉమాతో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఖరీదైన క్యాన్సర్‌ పరీక్షలు

గ్రామాల్లోనే ఉచితంగా...

మచిలీపట్నం పార్లమెంటు

సభ్యుడు ఎంపీ బాలశౌరి

Advertisement
Advertisement