భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు

Published Sat, May 4 2024 1:05 AM

-

కొత్తగూడెంటౌన్‌: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ తీర్పు శుక్రవారం తీరు చెప్పారు. పాల్వంచ మసీదు గుట్టకు ప్రాంతానికి చెందిన దేవెళ్ల జ్యోతి కుమార్తె లావణ్య, ఇందిరానగర్‌కు చెందిన భూక్య విజయ్‌తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ప్రియాని జన్మించింది. కొంతకాలం తర్వాత విజయ్‌ తన భార్య లావణ్యను అనుమానంతో వేధించసాగాడు. వేధింపులు తట్టుకోలేక ఆలౌట్‌ తాగి ఆత్మహత్యకు కూడా యత్నించింది. ఈ క్రమంలో లావణ్య తన కూతురు, తల్లితో కలిసి పాల్వంచలోనే గాంధీనగర్‌లో వేరుగా ఉంటోంది. దీంతో అక్కడికి వచ్చి గొడవ పడి కూతురును తీసుకెళ్లాడు. దీంతో లావణ్య తల్లితోపాటు కల్లూరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 2019 జూలై 8న ఫోన్‌ చేసి కూతురు ప్రియానిని ఇస్తామని చెప్పడంతో తల్లీకూతుళ్లు పాల్వంచ వెళ్లగా, అక్కడి నుంచి పాపను ఇస్తానంటూ విజయ్‌ తన భార్యను తీసుకుని వెళ్లాడు. ఆరుగంటలైనా తిరిగి రాకపోవడంతో ఇందిరానగర్‌ కాలనీలోని ఇంటికి వెళ్లి చూడగా, లావణ్య మృతి చెంది ఉంది. దీంతో తన కూతురిని భర్తే హతమార్చాడని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పాల్వంచ టౌన్‌ పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్‌ను దాఖలు చేశారు. కోర్టులో 11 మంది సాక్షులు విచారించిన అనంతరం భూక్య విజయ్‌పై నేరం రుజువుకావడంతో సెక్షన్‌ 498ఏ ప్రకారం మూడేళ్ల జైలు, రూ.1000 జరిమానా, 302 సెక్షన్‌ ప్రకారం జీవితఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని రాధాకృష్ణమూర్తి ప్రాసిక్యూషన్‌ నిర్వహించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ పీసీ గంగావత్‌ భాస్కర్‌, లైజన్‌ ఆఫీసర్‌ ఎన్‌.వీరబాబులు సహకరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement