ఇకపై బాణాసంచా రహిత దీపావళి  | WWF-India EIACP launches nationwide Green Diwali Campaign 2026 | Sakshi
Sakshi News home page

ఇకపై బాణాసంచా రహిత దీపావళి 

Oct 22 2026 6:52 AM | Updated on Oct 22 2026 6:52 AM

WWF-India EIACP launches nationwide Green Diwali Campaign 2026

దేశవ్యాప్తంగా ‘గ్రీన్‌ దీపావళి’ప్రచార కార్యక్రమం ప్రారంభం 

నవంబర్‌ 8 వరకు అవగాహన కార్యక్రమాలు 

పర్యావరణహిత పండుగకు ప్రజలు సహకరించాలి 

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘గ్రీన్‌ దీపావళి’ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మద్దతుతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌–ఇండియా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 8వ తేదీ వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా బాణాసంచా వినియోగాన్ని నివారించి, పర్యావరణహితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని నిర్వాహకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి జీవనశైలిలో అంతర్భాగంగా మార్చాలనే ‘మిషన్‌ లైఫ్‌’లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, నివాస సంక్షేమ సంఘాలు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన కలి్పంచనున్నారు. ముఖ్యంగా జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం పరిధిలోని 130 నగరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  

పర్యావరణహిత దీపావళి ప్రతిజ్ఞ 
‘గ్రీన్‌ దీపావళి’ప్రచారంలో భాగంగా ప్రజలు బాణాసంచా కాల్చకుండా ఉండటంతోపాటు తమ కుటుంబ సభ్యులను, పొరుగువారిని కూడా అదే విధంగా ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సంప్రదాయ మట్టి ప్రమిదలు, విద్యుత్‌ ఆదా చేసే లైట్లను వినియోగించడం, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటం, చెత్తను వేర్వేరుగా విభజించడం, స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ సంఘాలు తమ పరిధిలో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా సమావేశాలు, తరగతులు, ర్యాలీలు, సామాజిక సమావేశాల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.  

కార్బన్‌ పాదముద్రపై అవగాహన 
రోజువారీ జీవనశైలి, వినియోగ అలవాట్లు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని తెలుసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌–ఇండియా రూపొందించిన కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ సర్వేలోనూ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు. ఈ సర్వే ద్వారా వ్యక్తిగతంగా పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసుకుని, మరింత పర్యావరణహితమైన అలవాట్లను అలవరచుకోవచ్చు. గ్రీన్‌ దీపావళి ప్రచారంలో పాల్గొనే పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీ సంఘాలు, వ్యక్తులు తమ కార్యక్రమాల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సమరి్పంచాలని కోరారు. ఇందులో సంస్థ పేరు, ప్రాంతం, నిర్వహించిన కార్యక్రమం, తేదీ, ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య, జియోట్యాగ్‌ చేసిన ఫొటోలు, సంక్షిప్త నివేదికను పొందుపరచాలి. ఎంపిక చేసిన కార్యక్రమాల వివరాలను ఈఐఏసీపీ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే అవకాశం ఉంది. ప్రజలందరూ భాగస్వాములై కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణాన్ని కాపాడే విధంగా దీపావళి పండుగ జరుపుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement