ఈగను చంపడానికి సుత్తిని వాడొద్దు | SC asks Centre to ease metro, train curbs ahead of CJP protest | Sakshi
Sakshi News home page

ఈగను చంపడానికి సుత్తిని వాడొద్దు

Oct 10 2026 5:40 AM | Updated on Oct 10 2026 5:40 AM

SC asks Centre to ease metro, train curbs ahead of CJP protest

 శాంతిభద్రతల పేరుతో ప్రజా రవాణాను స్తంభింపజేయొద్దు  

రైళ్లు, మెట్రో సేవలను పూర్తిగా నిలిపివేయడం తగదు  

ప్రజా రవాణా వ్యవస్థను నియంత్రిత పద్ధతిలో నడపాలి  

ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి  

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ:  ఈగను చంపడానికి సుత్తిని వాడకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టనున్న నిరసన సందర్భంగా నగరంలో మెట్రో స్టేషన్లు మూసివేయడం, న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు వచ్చే రైళ్లను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయడం సరైంది కాదని తేల్చిచెప్పింది. 

మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై అధికారులు తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీతోపాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్లు కపిల్‌ సిబల్, గోపాల్‌ శంకరనారాయణన్, డాక్టర్‌ ఏఎం సింఘ్వీ, ఎన్‌.హరిహరన్, వృందా గ్రోవర్‌ తదితరులు అత్యవసరంగా ఈ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజా రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

గురుగ్రామ్, గ్రేటర్‌ నోయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల నుంచి ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ సెంట్రల్‌ ఢిల్లీకి వచ్చే వేలాది మంది ప్రజలు ప్రజా రవాణాపైనే ఆధారపడుతున్నట్లు గుర్తుచేసింది. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఉంటారని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉండదని, ప్రైవేట్‌ రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే నిరసనకారుల కదలికలను నియంత్రించాలనే ఉద్దేశంతో మొత్తం రవాణా వ్యవస్థను నిలిపివేయడం సమంజసం కాదని తేల్చిచెప్పింది.  

నిష్పత్తి సూత్రాన్ని పాటించాలి  
చట్టాన్ని అమలు చేసే అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని.. అయితే, ఆ చర్యలు అవసరానికి మించి ఉండకూడదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. న్యాయపరమైన చర్యల్లో ‘నిష్పత్తి సూత్రం’పాటించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన మేరకే ఆంక్షలు విధించాలని, అదేసమయంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దూరం కాకుండా చూడాలని అన్నారు.

 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్కృమణ మార్గాలను పూర్తిగా మూసివేయడంపై అభ్యంతరం తెలిపారు. మెట్రో రైళ్ల రాకపోకల సంఖ్యను తగ్గించడం లేదా ప్రయాణికుల కదలికలను నియంత్రించడం ఒక చర్య అయితే, మొత్తం సేవలను నిలిపివేయడం మరో విషయమని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు. రైళ్ల, మెట్రో రాకపోకలను నియంత్రించాలే తప్ప పూర్తిగా నిలిపివేయరాదని సూచించారు.  

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ధర్మాసనం వ్యక్తంచేసిన ఆందోళనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రవాణా సేవలను నియంత్రిత పద్ధతిలో కొనసాగించే అంశాన్ని పునఃపరిశీలించేలా కృషి చేస్తానని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రైళ్లు, మెట్రో సేవలను పూర్తిగా నిషేధించకుండా, తగిన నియంత్రణలతో నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement