కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ జంతర్ మంతర్ వద్ద చేపట్టాల్సిన ఈసీ వ్యతిరేక నిరసనలకు ఢిల్లీ పోలీసులు అడ్డుపడ్డారు. కఠిన ఆంక్షల నడుమ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టులతో సీజేపీలో గందరగోళం నెలకొంది. మరోవైపు పలువురు మద్దతుదారుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో సీజేపీ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
కాక్రోచ్‌లను కొత్త నాయకుడు ముందుండి నడిపించబోతున్నాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి అజింక్య షిండే నాయకత్వం వహించనున్నారు. కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనను కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. వాళ్లు వచ్చేదాకా ఈ కొత్త సారథే ఉద్యమాన్ని నడిపించనున్నట్లు తెలుస్తోంది.

35 ఏళ్ల అజింక్య షిండే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యువజన విభాగంలో మహారాష్ట్ర కన్వీనర్‌గా, గోవా సహ ఇన్‌చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం సీజేపీలో సంస్థాగత వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు నిర్బంధంలో ఉండటంతో నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై పడింది.
వాంగ్‌చుక్ ఎక్కడ?
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనలో పాల్గొనడం లేదు. దీంతో మద్దతు లేదన్న ప్రచారం జోరందుకుంది. అయితే అలాంటిదేం లేదని ఆయన ఓ సందేశం రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను లద్ధాఖ్ రీజియన్‌లో నీటి భద్రత కోసం కృత్రిమ హిమానీనదాల నిర్మాణం, హిమాలయాల్లో హిమానీనద సరస్సులు ఉప్పొంగి వరదలు ముంచెత్తే ప్రమాదాన్ని ఎదుర్కొనే చర్యలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. నిరసన నేతలంతా ఐక్యంగా ఉండాలని, యువత ముఖ్యంగా జెన్ జెడ్ ఆందోళనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
అరెస్టును ముందే ఊహించిన దీప్కే?
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ముందే ఊహించినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆయన ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. నిరసనకు ముందే కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది.
అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా పోలీసులు ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదీ విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు వందల కొద్దీ కార్యకర్తలను అలాగే మద్దతుదారుల్ని నిర్బంధించారు. దీంతో నిరసనకు నాయకత్వం వహించేందుకు అజింక్య షిండే ముందుకు వచ్చారు. కీలక నేతలు అందుబాటులో లేకపోయినా ఆందోళనను కొనసాగించాలన్న పార్టీ నిర్ణయం నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: కాక్రోచ్‌లకు పోలీసుల మాస్టర్ స్ట్రోక్!


