మహోజ్వల భారతి ఉద్యమ రత్నం రాజాజీ

Azadi Ka Amrit Mahotsav Rajaji Movement - Sakshi

రాజాజీగా ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ తొలి, చివరి గవర్నర్‌ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు ఇది. ఆయన 1948 జూన్‌ 21న ఆ పదవిని చేపట్టి, 1950 జనవరి 26 వరకు కొనసాగారు. అక్కడితో గవర్నర్‌ జనరల్‌ పదవి రద్దయి, రాష్ట్రపతి హోదా మొదలైంది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు రాజాజీ భారత దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమికంగా ఆయన కాంగ్రెసువాది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

రాజాజీ రాజకీయ ప్రస్థానం సేలం పట్టణం నుంచి ప్రారంభమైంది. 22 ఏళ్ల వయసులో జాతీయవాది బాలగంగాధర తిలక్‌ పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పుడే సేలం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. లాయర్‌ కూడా అయిన రాజాజీ 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్య్ర పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించారు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై, రాజాజీ మంచి స్నేహితులు. అనిబిసెంట్‌ కూడా రాజాజీని అభిమానించేవారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ ఆయన్ని అనుసరించారు.

ఉద్యమం కోసం న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశారు. 1921 లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి జనరల్‌ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు. 1930 లో తమిళనాడు కాంగ్రెస్‌లో నాయకుడయ్యారు. అదే సమయంలో మహాత్మాగాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్లారు. తరువాత  తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో రాజాజీ ఒకరు. సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878 డిసెంబరు 10 న జన్మించిన రాజాజీ, 1972 డిసెంబర్‌ 25న తన 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.  

(చదవండి: చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top