సాక్షి, న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్ కంటే ముందు కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసం రాహుల్ ఇష్ఠారీతిన అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇండి కూటమి నేతలపై ఈ రోజు (మంగళవారం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.రాహుల్ దురుద్దేశంతోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని 2029 ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు ఉంటారో తేల్చుకుందామని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరో ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని, కాంగ్రెస్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాబోతోందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చొరబాటుదారులను రక్షించడమేనని అమిత్ షా ఆరోపించారు.
కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ రంగులను దేశ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఆత్మపరిశీలన చేసుకోకుండా... ఎన్నికల సంఘం, ఈవీఎంలు లేదా సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోల్పోయిన రాహుల్ గాంధీ, కేవలం దురుద్దేశంతోనే ఇష్టారీతిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బాధ్యతల నుండి విముక్తి కల్పించండి


