డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల | Sakshi
Sakshi News home page

డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Published Tue, Apr 16 2024 2:00 AM

స్పటిక లింగానికి పూజలు చేస్తున్న అర్చకుడు
 - Sakshi

డిండి : డిండి ప్రాజెక్టు పరిధిలో భూగర్భ జలాల పెంపునకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిండి ప్రాజెక్టు ఎడమ కాలువకు సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కారణంగా బోరుబావులు వట్టిపోవడంతో.. భూగర్భ జలాలను పెంచడం కోసం డిండి, చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని చెరువులు, కుంటలు నింపేందుకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈ ఫయాజ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కర్ణాకర్‌, సిబ్బంది తదితరులున్నారు.

మహా శివుడికి అభిషేకాలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.వేకువజామున సుప్రభాతం, అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, జోడు సేవలకు ఊరేగింపు తదితర కై ంకర్యాలు గావించారు. అదే విధంగా కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు.

రోగులతో కిక్కిరిసిన ఎయిమ్స్‌

బీబీనగర్‌ : వైద్యసేవల్లో బీబీనగర్‌ ఎయిమ్స్‌ ప్రత్యేకత చాటుకుంటోంది. మూడేళ్ల నాటితో పోలిస్తే ప్రస్తుతం సేవలు మెరుగుపడ్డాయి. ఖర్చు కూడా తక్కువగా ఉండడంతో రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే 2వేలకు పైగా రోగులు ఆస్పత్రికి తరలివచ్చారు. చుట్టుపక్క జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి రోగులు భారీగా తరలిరావడంతో ఓపీ విభాగం కిక్కిరిసింది. ఓపీ కార్డు కోసం రోగులు గంటకు పైగా క్యూలైన్‌లో నిల్చున్నారు. అయితే మూడు కౌంటర్లు మాత్రమే ఉండడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. క్యూలైన్‌లో గంట, సీరియల్‌ ప్రకారం డాక్టర్‌ను కలవడానికి మరో గంట, వైద్య పరీక్షల కోసం మరో 2 గంటలు.. పొద్దస్తమానం ఎయిమ్స్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కౌంటర్లు పెంచాలని రోగులు కోరుతున్నారు.

మట్టపల్లిలో

నారసింహుడి కల్యాణం

మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం జరిపారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా ముస్తాబుచేసి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణతంతు పూర్తిచేశారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించి ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదనచేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు పాల్గొన్నారు.

డిండి ప్రాజెక్టు ఎడమకాల్వకు 
విడుదలవుతున్న నీరు
1/2

డిండి ప్రాజెక్టు ఎడమకాల్వకు విడుదలవుతున్న నీరు

ఓపీ కార్డు కోసం క్యూలైన్‌లో నిల్చున్న 
రోగులు
2/2

ఓపీ కార్డు కోసం క్యూలైన్‌లో నిల్చున్న రోగులు

Advertisement
Advertisement