భారతీయ సినీ చరిత్రలో సరికొత్త ప్రయోగాలకు తెరతీస్తూ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రామాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదే బ్రహ్మ ఏఐ టెక్నాలజీ. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల పెదవుల కదలికలను వివిధ భాషలకు అనుగుణంగా మార్చిన విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రధానంగా హిందీ భాషలో రూపొందిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో నటీనటులు తెలుగులో మాట్లాడుతున్నట్లుగా వారి పెదవుల కదలికలు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక భాషలో చిత్రీకరించిన సినిమాను మరో భాషలోకి అనువదించినప్పుడు మాటలకు, పెదవుల కదలికలకు మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ ‘రామాయణ’ ట్రైలర్‌లో మాత్రం ఆయా భాషలకు అనుగుణంగా లిప్ సింక్ కనిపించడంతో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందనే చర్చ మొదలైంది.
వాణి ఇంజిన్
ఈ ప్రయోగం వెనుక ‘బ్రహ్మా’ ఏఐ సాంకేతికతలోని ‘వాణి’ (VAANI) ఇంజిన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత సాయంతో నటీనటుల పెదవుల కదలికలను ఆయా భాషల్లోని సంభాషణలకు అనుగుణంగా మార్చి, ప్రేక్షకులకు సహజమైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ ప్రక్రియలో కేవలం కృత్రిమ మేధస్సుపైనే ఆధారపడలేదని తెలుస్తోంది. వివిధ భాషల్లో నైపుణ్యం ఉన్న భాషా నిపుణులు, డబ్బింగ్ కళాకారుల సహకారాన్ని కూడా తీసుకున్నారని సమాచారం. కాగా ‘రామాయణ’లో ఉపయోగిస్తున్న ఈ సాంకేతికత ఆశించిన స్థాయిలో ఫలిస్తే, భవిష్యత్తులో భారతీయ సినిమాలను పలు భాషల్లో సహజమైన అనుభూతితో ప్రేక్షకులకు అందించే అవకాశాలు మరింత పెరగనున్నాయి.
సినిమా విషయానికి వస్తే..
నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబరు 5న, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: 14ఏళ్లకే తల్లిని మించిన ఐశ్వర్య కూతురు.. ఫొటోలు వైరల్)


