జయ నాగేశ్వర రెడ్డిపై క్రిమినల్‌ కేసులు | Sakshi
Sakshi News home page

జయ నాగేశ్వర రెడ్డిపై క్రిమినల్‌ కేసులు

Published Tue, Apr 23 2024 8:15 AM

-

కర్నూలు(సెంట్రల్‌): ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జయనాగేశ్వరరెడ్డిపై ఐదు క్రిమినల్‌ కేసులు విచారణలో ఉన్నాయి. నామినేషన్‌ వేసిన సమయంలో అఫిడవిట్‌లో ఈ అంశాలను ఆయన పొందుపరిచారు. వ్యాపార లావాదేవీల్లో తీసుకొన్న సొమ్ము తిరిగి ఇవ్వలేదని, బ్లాంక్‌ చెక్‌లతో బురిడీ కొట్టించాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రమణ్యం అనేవ్యక్తి( సీసీ197/2019) చిత్తూరు కోర్టులో బి.జయనాగేశ్వరరెడ్డిపై చెక్‌బౌన్స్‌ కేసువేశారు. ఆ కేసు విచారణలో ఉంది. ఇదే కేసులో తప్పుడు సమాచారం ఇచ్చారని బాధితుడు శ్రీకాళహస్తి వన్‌ టౌన్‌ పీఎస్‌లో జయనాగేశ్వరరెడ్డిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంబీబీఎస్‌ చదివినట్లు తప్పడు అఫిడవిట్‌ సమర్పించాడంటూ టీడీపీకే చెందిన మాజీకౌన్సిలర్‌ కోనేరు నాగేంద్రప్రసాద్‌ కేసు (ఆర్‌పీ నెం.9/2018 ఐపీసీ సెక్షన్‌ 506,499,500, 120ఏ) వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఆదోని కోర్టు లో విచారణలో ఉంది. ఎమ్మిగనూరు టౌన్‌ పీఎస్‌లో ఆయనపై (క్రైం నంబర్‌ 358/2021) బైండోవర్‌ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయా లని కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. చిత్తూరు టూటౌన్‌ అర్బన్‌ పీఎస్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. 417, 420,120బీ,193,194,467,468, 156 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన పేరిట రూ.13.59 లక్షల విలువ చేసే 200 గ్రాముల బంగా రం అభరణాలు, భార్య బైరెడ్డి నిత్యాదేవి పేరిట రూ. 40.77 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారుఅభరణాలు ఉన్నాయి. వీరికి ఒక కారు ఉన్నట్లు ఆఫిడవిట్‌లో చూపారు.

పొలాలు.. ఇళ్లే సాయిప్రసాద్‌రెడ్డి ఆస్తులు

ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.సాయిప్రసాద్‌రెడ్డికి వంశపార్యపరంగా వస్తున్న పొలాలు.. ఇళ్లే ఆస్తులుగా ఉన్నాయి. సోమవారం ఆయన నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తన ఆస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆయనకు అనంతపురం జిల్లా కొనకొండ్ల, మంత్రాలయం మండలం రాంపురం, కాశాపురంలలో 39 ఎకరాల వ్యవసాయ భూమి, ఆదోనిలో ఒక ఇల్లు ఉంది. అలాగే తన భార్య వై.శైలజ పేరిట కూడా కొనకొండ్ల, ఆదోనిలోని మండగిరి, 9.47 ఎకరాల భూమి, ఆదోని, నంద్యాల, కసాపురం, మండిగిరిలలో నాలుగు ప్లాట్లు, ఆదోనిలో ఒక్క ఇల్లు, కర్నూలులో టీజే షాపింగ్‌ మాల్‌లో 1551 చదరపు అడుగుల ప్లాట్‌ ఉంది. మొత్తంగా ఆయన పేరిట చరాస్తిరాస్తులు రూ. 4.22 కోట్లు ఉండగా, ఆమె పేరిట రూ. 5.99 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతేకాక ఆయన పేరిట రూ.15 లక్షల విలువ చేసే 25 తులాల బంగారు అభరణాలు, రూ.3 లక్షల విలువ చేసే వెండి ఉంది. ఆమె పేరిట రూ.57 లక్షల విలువ చేసే 96 తులాల బంగారు, 3.75 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. వీరి కుటుంబానికి ఎలాంటి వాహనం లేదు. అంతేకాక సాయిప్రసాద్‌రెడ్డి పేరిట రూ.1.22 కోట్లు, భార్య పేరిట రూ. 44.39 లక్షల అప్పులు ఉన్నాయి.

Advertisement
Advertisement