హంద్రీనదికి జీడీపీ నీరు విడుదల | Sakshi
Sakshi News home page

హంద్రీనదికి జీడీపీ నీరు విడుదల

Published Thu, Nov 23 2023 1:58 AM

అక్షింతలతో మండలాల ప్రతినిధులు 
 - Sakshi

కోడుమూరు రూరల్‌: వర్షాభావ పరిస్థితుల వల్ల హంద్రీనది ఎండిపోవడంతో కోడుమూరు నదీ పరివాహక ప్రాంతాలైన కోడుమూరు, వర్కూరు, గోరంట్ల గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తింది. నీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి నీటిని విడుదల చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు జిల్లా అధికారులను కోరగా, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు బుధవారం జీడీపీ నీటిని ఎల్‌ఎల్‌సీ ద్వారా వర్కూరు శుద్దవాగు మీదుగా హంద్రీనదిలోకి విడుదల చేశారు. నీటి విడుదలను కోడుమూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రసాద్‌, పంచాయతీ ఈఓ అజయ్‌భాస్కర్‌ పరిశీలించారు.

గూడూరులో ఉల్లి, టమాట సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఉల్లి, టమాట సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక్కడ ఉల్లి గోదాముతో పాటు ఇతర గోదాములు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు అవసరమైన భూమిని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు ప్రతిపాదనలు పంపారు. రెండు ఉల్లి గోదాములు, సీసీ రోడ్డు, 600 టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు గోదాములు, ఎకరా స్థలం ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ ఏడీ నారాయణ మూర్తి ప్రతిపాదనలు పంపారు. మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీటిని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీకి అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. యూనిట్‌ ఏర్పాటయితే ఉల్లి, టమాట దిగుబడులకు మంచి గిరాకీ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మండలాలకు పవిత్ర అక్షింతల పంపిణీ

కర్నూలు కల్చరల్‌: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కాబోతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు చేరుకున్న భగవాన్‌ శ్రీరామ్‌ లల్లా విరాజ్‌ మాన్‌ వేద మంత్రాలతో పూజించిన పవిత్ర అక్షింతలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు. బుధవారం వినాయక్‌ ఘాట్‌లో అక్షింతలకు పూజలు చేసి 9 రెవెన్యూ మండలాలు, నగరంలోని 616 డివిజన్ల ప్రతినిధులకు అందజేశారు. వీహెచ్‌పీ సహ కార్యరద్శి ప్రాణేష్‌, జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, కోశాధికారి సందడి మహేష్‌లు అతిథులుగా హాజరై అక్షింతలను అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ కార్యదర్శి భాను ప్రకాష్‌, సహ కార్యదర్శి గోవింద రాజులు, జిల్లా కోశాధికారి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు మద్దిలేటి, నగర కార్యదర్శి నాగరాజు, జిల్లా మాతృ శక్తి సంయోజిక సంపాల రాధిక తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం కావాలి

కర్నూలు(హాస్పిటల్‌): గర్భిణిలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేటట్లు చూడాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ వై. ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బుధవారం ఆయన బి.క్యాంపు, ఎఫ్‌సీఐ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ సచివాలయాల్లో జరుగుతున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులను ముందుగానే ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేయించి, హైరిస్క్‌ ఉన్న వారిని మూడు రోజుల ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. అనంతరం వారికి ఐరన్‌ మాత్రలు, పిల్లలకు ఐఎఫ్‌ఏ, విటమిన్‌–ఎ సిరప్‌లు పంపిణీ చేశారు. బుధ, శనివారాల్లో పదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక టీడీ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి టీకాలు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మహాలక్ష్మి, డీసీఎం ప్రసాద్‌, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.

జీడీపీ నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
1/1

జీడీపీ నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

Advertisement
Advertisement