Sakshi News home page

నిప్పు.. ముప్పు!

Published Tue, Apr 16 2024 12:05 AM

జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది - Sakshi

శిథిలావస్థలో కార్యాలయాలు

జిల్లా కేంద్రంలో 1984లో అగ్నిమాపక కా ర్యాలయం ఏర్పాటు చేశారు. తొలుత వివేకానంద చౌక్‌ సమీపంలోని పాత గ్రామ పంచాయతీలో కార్యాలయం కొనసాగగా, అ నంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట కొత్తగా అగ్నిమాపక కార్యాలయానికి స్థలం కే టాయించారు. ప్రస్తుతం ఈ కార్యాలయ కూడా భవనం శిథిలావస్థకు చేరుకుని స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయానికి సైతం సొంత భవనం లేక ఈజ్‌గాం రహదారిలోని ఓ పాత పాఠశాలలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. ఇటీవల కొత్తవారిని భర్తీ చేసినా వారు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఆసిఫాబాద్‌ ఫైర్‌ స్టేషన్‌కు రెగ్యులర్‌ ఫైర్‌ అధికారి లేకపోడంతో చెన్నూ ర్‌ ఫైర్‌ అధికారి సంపత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆసిఫాబాద్‌: ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటా యి. సోమవారం సైతం రెబ్బెన మండలం వంకులంలో 42.9 డిగ్రీలుగా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి నిప్పు రవ్వ కూడా రూ.లక్షల ఆస్తిని బూడిద చేస్తుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం కొత్తగా ఆస్పత్రులు, పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లు, పరిశ్రమలు, భవనాలు పెరిగాయి. నిర్మాణ సమయంలోనే అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా యజమానులు పాటించడం లేదు. కనీస నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మారుమూల గ్రామాల్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్స్‌, ఇతర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్నిప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. అగ్నిమా పకశాఖ సైతం ప్రమాదాల నివారణపై దృష్టి సారించింది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో డివిజన్‌కు ఒకటి చొప్పున జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో మాత్రమే ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో కేంద్రం పరిధిలో 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణితోపాటు ఏజెన్సీ మండలాలకు సేవలందిస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్‌ కేంద్రం ద్వారా కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), దహెగాం, బెజ్జూర్‌, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ మండలాలకు సేవలందిస్తున్నారు. కొన్ని గ్రామాలు ఫైర్‌స్టేషన్లకు దూరం ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో సకాలంలో ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకోలేకపోతున్నాయి. ప్రమాదంలో ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన పంట పత్తి కావడంతో 22 జిన్నింగ్‌ మిల్లులు, రైస్‌ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిన్నింగ్‌ మిల్లుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లుతుంది. నాలుగేళ్లలో జిల్లాలో 173 అగ్ని ప్రమాదాలు జరగగా.. రూ.1,86,23,800 ఆస్తి నష్టం వాటిల్లింది. ఒకరు మృత్యువాత పడ్డారు.

ఫైర్‌ సేఫ్టీపై అవగాహన

ఏటా ఏప్రిల్‌ 14న అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1944 ఏప్రిల్‌ 14న ముంబై ఓడ రేవులో జరిగిన అగ్నిప్రమాదానికి జ్ఞాపికగా జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకొంటున్నారు. ఈ నెల 14 నుంచి జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్నిప్రమాదాల నివారణలో అమరులైన అగ్నిమాపక అధికారులు, సిబ్బందికి నివాళులర్పించారు. రెండో రోజు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 16న రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లలో అవగాహన సదస్సులు, 17న విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, 18న ఎల్‌పీజీ గోదాములు, పరిశ్రమల్లో అవగాహన సదస్సులు, 19న ఆసుపత్రుల్లో అవగాహన సదస్సులు, ఇక చివరి రోజు 20న ఫైర్‌ సేఫ్టీపై అవగాహన కల్పిస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్ల వద్ద మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తారు.

జాగ్రత్తలు పాటించాలి

వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. పరిశ్రమల్లో పరిశుభ్రత పాటించాలి. ఎలక్ట్రికల్‌ ఫైర్‌ జరిగినపుడు ప్రథమంగా మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిన తర్వాత సంబంధిత ఫైర్‌ ఆర్పడానికి ప్రయత్నించాలి. అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. జిల్లాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే 101 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.

– సంపత్‌, ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌, ఆసిఫాబాద్‌

గడిచిన నాలుగేళ్లలో 173 అగ్ని ప్రమాదాలు

రూ.1.86 కోట్ల ఆస్తి నష్టం

పెరిగిన ఎండలతో ప్రమాదాలకు ఆస్కారం

అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

ఈ నెల 20 వరకు వారోత్సవాలు

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ఆసిఫాబాద్‌అర్బన్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికులకు లీడింగ్‌ ఫైర్‌మెన్‌ నర్సింగ్‌రావు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులకు కరపత్రాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది మహేశ్‌కుమార్‌, రాము, తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement