పనులకు అనుగుణంగా కూలీలను పెంచాలి | Sakshi
Sakshi News home page

పనులకు అనుగుణంగా కూలీలను పెంచాలి

Published Tue, Apr 16 2024 11:40 PM

స్వాధీనం చేసుకున్న నగదుతో 
ఎఫ్‌ఎస్‌టీ అధికారులు - Sakshi

కాకినాడ సిటీ: ఉపాధి హామీ పథకం పనులకు అనుగుణంగా కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్దేశించిన పనులకు అనుగుణంగా కూలీల సంఖ్యను కూడా పెంచాలన్నారు. పంచాయతీలతో పాటు ఆవాసాల్లో ఉపాధి పనులు జరిగేలా చూడాలన్నారు. ఉపాధి కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్రమే పని సమయం ఉండేలా చూడాలని సూచించారు. పని చేసే ప్రాంతంలో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని, షెడ్లు వేయాలని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అలాగే వేసవి దృష్ట్యా ఎక్కడా విద్యుత్‌ సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ డి.తిప్పేనాయక్‌, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీపీఓ కె.భారతీ సౌజన్య, ఏపీ ఈపీడీసీఎల్‌ ఈఈ జి.ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, కాకినాడ నగరపాలక సంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు.

లాడ్జిలో

రూ.6 లక్షలు స్వాధీనం

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌టీ తనిఖీల్లో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక లాడ్జిలో రూ.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈఆర్‌ఓ, ఆర్‌డీఓ జేఎస్‌ రామారావు తెలిపారు. తమ టీములోని హౌసింగ్‌ ఈఈ వెంకటరాజు గుప్తా ఆధ్వర్యంలో తనిఖీ చేస్తుండగా మండలంలోని కాండ్రకోటకు చెందిన పల్లికల శ్రీరామచంద్రమూర్తి వద్ద ఉన్న నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేదని, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కార్యాలయంలో గతంలో పని చేసిన శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) ఆ నగదుతో దొరకడంతో సొత్తు టీడీపీకి చెందినదిగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

కారులో రూ.2.97 లక్షల పట్టివేత

కిర్లంపూడి: వాహనంలో డబ్బులు తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్సై షేక్‌ జబీర్‌తో కలిసి జగ్గంపేట సీఐ పి.లక్ష్మణరావు మండల పరిధిలోని జగపతినగరంలో మంగళవారం వాహనాలు తనిఖీ చేశారు. దివిలి నుంచి ప్రత్తిపాడు వైపు వస్తున్న కారులో రూ.2.97 లక్షల నగదు పట్టుబడింది. ఈ డబ్బును తరలిస్తున్న సమయమంతుల వెంకట సూర్యమల్లేశ్వరరావు ఎటువంటి ఆధారాలూ చూపించలేదు. దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లీడర్‌ మక్కా చిన్నారావుకు సమాచారం ఇచ్చి, పట్టుబడిన నగదును స్వాధీనం చేశారు. ఆ సొమ్మును జగ్గంపేట రిటర్నింగ్‌ అధికారికి అందజేశామని చిన్నారావు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement