Sakshi News home page

ఆధ్యాత్మికతకు నెలవు

Published Mon, Nov 13 2023 11:38 PM

అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం  - Sakshi

నేటి నుంచి కార్తికమాసం

అన్నవరం / పిఠాపురం / సామర్లకోట : ఆధ్యాత్మిక మాసం... కార్తికం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నెలరోజుల పాటు దేవాలయాల వద్ద ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కనుంది. అభిషేకాలు.. ప్రత్యేక పూజలు... ఆకాశదీపాలతోపాటు ఆలయాల వద్ద ప్రత్యేకంగా దీపాలను వెలిగించడం వంటి ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు పర్యాటక సందడి కూడా ప్రారంభమవుతోంది. సముద్ర తీరంలోని బీచ్‌లు.. పర్యాటక ప్రాంతాలను సందర్శించేవారు... గార్డెన్‌ పార్టీల నిర్వహణతోపాటు ఆయా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో కార్తిక వన సమారాధనలు జరగనున్నాయి.

శివకేశవులకు ప్రీతికరం : కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. కార్తిక పురాణంలో కార్తిక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను వివరిస్తాయి. కార్తిక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. ఈ ఏడాది నవంబర్‌ 14 మంగళవారం కార్తికమాసం ప్రారంభమవుతోంది. డిసెంబరు 13న బుధవారం పోలిస్వర్గంతో కార్తికం పూర్తవుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వేలాది మంది భక్తులు అయ్యప్పస్వామిమాలలు ధరించిన విషయం తెలిసిందే. వీరితోపాటు మహాశివుని మాలలు సైతం ధరిస్తున్నారు.

అన్నవరంలో ప్రత్యేక ఏర్పాట్లు

కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవునికి సైతం కార్తికమాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సోమవారాలలో 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు. పౌర్ణమి రోజున లక్ష మంది వరకు వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా క్యూలు పెంచడంతోపాటు ప్రసాదాల విక్రయాలు, ఇతర సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికం. ఆష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతోపాటు సమీపంలోని సామర్లకోట శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయానికి కూడా కార్తికమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సోమవారాలు రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. 29వ తేదీన ఇక్కడ స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు.

పాదగయ క్షేత్రం

Advertisement

తప్పక చదవండి

Advertisement