Sakshi News home page

సరిహద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం

Published Sat, Apr 20 2024 1:15 AM

పట్టుబడిన రేషన్‌ బియ్యం(ఫైల్‌) 
 - Sakshi

మంథని: పేదలకు చేరాల్సిన రాయితీ బియ్యం సరిహద్దులు దాటుతోంది. అయినా, అధికారులు ప ట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వందలాది క్వింటాళ్ల రేషన్‌ బి య్యం అక్రమంగా తరలిపోతోంది. అయితే, ఉప్పందుకుంటున్న ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మాటువేసి పట్టుకుంటున్నారు. వ్యాపారుల మధ్య నెలకొన్న వార్‌ నేఫథ్యంలో వారంరోజుల వ్యవధిలోనే మంథనిలో రెండుసార్లు రేషన్‌ బియ్యం అధికారులకు పట్టుబడటం గమనార్హం. మరోవైపు.. అ క్రమ దందాపై అఽధికారులకు సమాచారం ఉన్నా ని లువరించడంలో పట్టించుకోవడం లేదనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఇంతకాలం గుట్టుచప్పుడు కా కుండా సాగిన అక్రమ వ్యాపారం.. అక్రమార్కుల మధ్య వైరంతో బట్టబయలు కావడం గమనార్హం.

వారధులుగా బ్యారేజీ.. వంతెనలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీలు, వంతెనలు ప్రజా రవాణాకు కంటే అక్రమ దందాలకు వారధులుగా మారుతున్నాయి. అక్రమార్కులు ప్రధానంగా సబ్సిడీ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారని సమాచారం ఉంది. పేద, మధ్య తరగతితోపాటు ఉన్నతవర్గాలకు చెందిన అనేకమందికి రేషన్‌కార్డుల ద్వారా వచ్చే బియ్యం.. లబ్ధిదారులు తీసుకోకుండా డీలర్లకే విక్రయిస్తుండడంతో డీలర్లు వాటిని సేకరించి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి.

మంథని నుంచి మహారాష్ట్రకు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాతోపాటు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి మంథనికి చెందిన ఓ వ్యాపారి బియ్యం సేకరించి మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మరికొందరు వ్యాపారులు ఇదే దందాకు తెరలేపడంతో వ్యాపారుల మధ్యపోటీ పెరిగింది. ఈక్రమంలో ఒకరు వాహనం మరొకరు ఉన్నతాధికారులకు పట్టిస్తున్నారు. దీంతో అధికారులు ఏంచేస్తున్నట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పోలీసులకు చిక్కుండా..

సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు నిఘాలేని మార్గాలను ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ మీదుగా మంచిర్యాల జిల్లా దాటి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ, వంతెన.. అటుతర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్‌రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి బియ్యాన్ని చేర్చుతున్నట్లు సమాచారం. మంథని నుంచి తరలించే బియ్యం వాహనాల్లో లోడ్‌ అయ్యే వరకూ ఇక్కడి వ్యాపారి.. అటుతర్వాత తీసుకెళ్లే బాధ్యత మరో వ్యాపారి తీసుకొని అక్రమ దందాను మూడు లారీలు.. ఆరు వ్యాన్లు అన్నచందంగా రూ.లక్షల్లో దందా సాగిస్తున్నట్లు తెలిసింది.

6ఏ కేసులతో సరి..

జిల్లాలో పలుచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడుతుంటే అప్పటికప్పుడు 6ఏ కేసులతో సరిపెడుతున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వ్యాపారి ఎవరు? అనే కోణంలో అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు ఉన్నాయి. మూలాల్లో కి వెళ్లకపోవడంతో వ్యాపారులు దందాను ఆపడం లేదు. ఒకట్రెండుసార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్టు నమోదుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది వ్యాపారులు బినామీ పేర్లను వినియోగిస్తూ కేసులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు దృష్టి సారిస్తే అక్రమ దందా ఆపవచ్చనే వాదనలు ఉన్నాయి.

వ్యాపారుల మధ్య వార్‌తో పట్టుబడుతున్న బియ్యం

గోదావరి బ్యారేజీ, వంతెనలపై అక్రమ రవాణా

నిఘా పెంచాం

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాం. గ్రామాల్లో వీఆర్వోలు, ఆర్‌ఐల ద్వారా అనుమానితుల కదలికలు గమనిస్తున్నాం. 6ఏ కేసులతో పాటు పదేపదే పట్టుబడితే వ్యాపారులపై పీడీ యాక్టు నమోదుకు సిఫారసు చేస్తాం. సబ్సిడీ బియ్యం పక్కాదారి పడుతున్న సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

– ప్రకాశ్‌, తహసీల్దార్‌, మంథని

Advertisement
Advertisement