నిందితుడికి ఏడేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

నిందితుడికి ఏడేళ్ల జైలు

Published Thu, Nov 23 2023 12:04 AM

-

జగిత్యాలజోన్‌: వ్యవసాయ విద్యుత్‌ మోటార్‌ వద్దకు విద్యుత్‌ తీగను నిర్లక్ష్యంగా తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జంగిలి మల్లికార్జున్‌ కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన పిట్టల విద్యాధర్‌ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మ్యాక వెంకయ్యపల్లి ఊర చెరువును లీజుకు తీసుకొని చేపలు పెంచుతున్నాడు. 2019 సెప్టెంబర్‌ 30న భారీ వర్షాలతో చెరువులోని చేపలు కిందికి కొట్టుకుపోతున్నాయనే సమాచారమందింది. విద్యాధర్‌తో పాటు అతని అన్న పిట్టల కరుణాకర్‌, అదే గ్రామానికి చెందిన కొలిపాక తిరుపతి, అంగలి సంతోష్‌, ఐతరవేని నర్సయ్య, ఆత్మకూరి అంజయ్య, ఆత్మకూరి హరీష్‌ చేపలు కొట్టుకుపోకుండా తమ మోటార్‌ సైకిళ్లపై చెరువు వద్దకు వెళ్లి వలలు వేశారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల సమయంలో చెరువు కట్టపై నుంచి ఇంటికి వస్తున్నారు. మ్యాక వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన మ్యాక బ్రహ్మానందరెడ్డి తన పొలానికి చెరువు నుంచి నీరందించేందుకు విద్యుత్‌ మోటార్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ తీగను చెరుకు కట్ట రోడ్డు మధ్యలో నుంచి తీసుకెళ్లాడు. ఈ తీగకు మోటార్‌ సైకిల్‌ తగిలి తీగ తెగింది. మోటార్‌ సైకిల్‌పై ఉన్న విద్యాధర్‌, తిరుపతి విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయారు. వెనక వచ్చిన వ్యక్తులు కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మానందరెడ్డిపై చర్య తీసుకోవాలని పెగడపల్లి పోలీసులకు విద్యాధర్‌ భార్య ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ బి.జీవన్‌ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ కె.కిశోర్‌ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు ఎం.కిరణ్‌కుమార్‌, కె.విద్యాసాగర్‌ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం బ్రహ్మానందరెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement