ధాన్యం తూర్పారబట్టాల్సిందే..! | Sakshi
Sakshi News home page

ధాన్యం తూర్పారబట్టాల్సిందే..!

Published Thu, Nov 23 2023 12:04 AM

మిషన్‌ ద్వారా ధాన్యం తూర్పారపడుతున్న రైతులు
 - Sakshi

జగిత్యాలఅగ్రికల్చర్‌: వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలున్నా.. ఓవైపు రైస్‌ మిల్లర్లు, మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తప్ప, తాలు లేకున్నా తూర్పార పట్టమని పట్టుబడుతున్నారు. దీంతో రైతులు చేసేదేం లేక తమ శ్రమతో పాటు అధిక ఖర్చు పెట్టి తూర్పార పట్టాల్సిన పరిస్థితి దాపురించింది.

నాణ్యత ప్రమాణాల నిబంధనలు

ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాల నిబంధనల ప్రకారం రైతులు తీసుకొచ్చే ధాన్యంలో క్వింటాల్‌కు మట్టి, పెళ్లలు, రాళ్లు 1 శాతం, చెత్త, తాలు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ రకముల మిశ్రమం 6 శాతం ఉన్నా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాని కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తప్ప, తాలు ఉందని, ప్రతి కుప్పను తూర్పారపట్టమని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సర్టిఫై చేయాల్సిన అధికారులు సైతం వంత పాడుతున్నారు. ఒకవేళ నాణ్యత ప్రమాణాల ప్రకారం వ్యవసాయాధికారులు సర్టిఫైడ్‌ చేసిన తర్వాత కొనుగోలు నిర్వాహకులు తూకం వేసి బస్తాలను రైస్‌ మిల్లుకు పంపించినా.. తప్ప, తాలంటూ క్వింటాల్‌కు 1 నుంచి 2 కిలోల వరకు రైస్‌ మిల్లర్లు కట్‌ చేసే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రైస్‌ మిల్లర్ల కటింగ్‌ లేకున్నా.. రైతులకు ధాన్యం తూర్పార పట్టడం మాత్రం తప్పడం లేదు.

అప్పుడు ఇలా లేదు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. ఆ సమయంలో రాని తప్ప, తాలు ఇప్పుడే ఎందుకు వస్తుందో అర్థం కాని ప్రశ్నగా మారింది. రెండేళ్ల క్రితం అంటే అగ్గి తెగులు వంటి రోగాలు వచ్చి కొంతమేర తప్ప వచ్చింది. అదే అదునుగా తీసుకుంటున్న రైస్‌ మిల్లర్లు అప్పటి నుంచి మొన్నటి యాసంగి వరకు జబర్‌దస్తీగా 40 కిలోల సంచికి కిలో నుంచి 2 కిలోలు కట్‌ చేశారు. తూకం వేసేటప్పుడు సంచికి బదులు సంచి వేయాల్సి ఉండగా, 700 గ్రాముల సంచికి కిలో కట్‌ చేస్తున్నారు. వరి కోసే హార్వెస్టర్లను ప్రతి సీజన్‌కు ఆధునికీకరించి తప్ప, తాలు రాకుండా చూస్తున్నా.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన తర్వాత తప్ప, తాలుందని పట్టమనడం కామన్‌గా మారిపోయింది.

మిషన్లు లేవు..

జిల్లాలో దాదాపు 398 కొనుగోలు కేంద్రాలుండగా.. అందులో చాలా కేంద్రాల్లో తూర్పార పట్టే మిషన్లు లేవు. మిషన్లున్నా పని చేసే పరిస్థితి లేదు. చాలా కొనుగోలు కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా లేదు. ఒకవేళ ఉన్నా విద్యుత్‌ స్తంభం ఎక్కడో ఉండటం, అక్కడి నుంచి సరిపడా విద్యుత్‌ తీగ లేక మిషన్‌ ధాన్యం కుప్పల వద్దకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో రైతులే ట్రాక్టర్‌కు ఫ్యాన్లు బిగించుకొని కూలీలతో చాటల ద్వారా ధాన్యం గాలికి ఎగబోయడం చేసి ధాన్యాన్ని తూర్పారపడుతుంటారు. కాని ట్రాక్టర్‌ ఫ్యాన్ల ద్వారా ఎగబోస్తే ఒప్పుకోమని, తూర్పార బట్టే మిషన్‌ ద్వారానే తూర్పారబట్టాలని ఇలా లేనిపోని కండీషన్లు రైతులకు శరాఘాతంగా మారాయి.

నాణ్యత ప్రమాణాల నిబంధనలు గాలికి..

ఖర్చు పెరుగుతుందంటున్న రైతులు

వైఎస్‌ హయాంలో కొనేవారు

ధాన్యం నిబంధనల ప్రకారమున్నా తూర్పార పట్టమంటున్నారు. వైఎస్‌ హయాంలో హార్వెస్టర్‌తో కోయించి కొనుగోలు కేంద్రంలో పోస్తే ధాన్యం కొనేవారు. ఇప్పుడు ప్రతి కుప్పను తూర్పార పట్టమనడంతో రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయి.

– సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్‌

తేమతో ఇబ్బంది

శీతాకాలంలో వరి ధాన్యంలో తేమ పోవాలంటేనే చాలా రోజులు పడుతుంది. దీనికితోడు ప్రతి కుప్పను తూర్పార పట్టమంటున్నారు. ఒక్క మిషన్‌ ఉంటే ఆ మిషన్‌ కోసం రాత్రింబవళ్లు తిరగాల్సి వస్తుంది. అధునాతన హార్వెస్టర్లతో కోయిస్తున్నందున తప్ప, తాలు వచ్చే పరిస్థితి లేదు.

– బందెల మల్లయ్య,

చల్‌గల్‌, జగిత్యాల రూరల్‌(మం)

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement