జెలెన్‌స్కీ సంచలన ప్రకటన | russia ukraine war zelensky says will stop russia refinarys | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Oct 11 2026 5:51 PM | Updated on Oct 11 2026 6:00 PM

russia ukraine war zelensky says will stop russia refinarys

కీవ్:  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే దానికి బదులుగా రష్యా తమ దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపి వేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలే రష్యాతో ట్రంప్ డీజిల్‌ ప్రకటించినప్పటి నుంచి అమెరికా, ఉక్రెయిన్ నాయకుల మధ్య విభేదాలు  తీవ్రమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం, రష్యా నుంచి పెద్ద మొత్తంలో డీజిల్‌ను ప్రపంచ ఇంధన మార్కెట్లలోకి విడుదల చేయడానికి బదులుగా, రష్యాపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు కల్పించనున్నారు. ఈ నిర్ణయంపై జెలెన్‌స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం బలహీనమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు. దీనివల్ల ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగించేందుకు రష్యాకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల మధ్య జెలెన్‌స్కీ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) వేదికగా తన వైఖరిని వెల్లడించారు. “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తే, మేము కూడా రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకునే ఏ చర్య అయినా పరస్పరం ఉండాలి. అంతేకాకుండా, వాటికి నిజమైన హామీలు కూడా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు.

అయితే, శనివారం ట్రంప్ స్పందిస్తూ, ఇంధన ధరలు పెరగడానికి ఉక్రెయిన్ రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై జరుపుతున్న దాడులే కారణమని ఆరోపించారు. యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సి ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జెలెన్‌స్కీ తాజాగా తన పంథా మార్చుకున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఫిబ్రవరి చివరి నుంచి గణనీయంగా పెరిగాయి. ఆ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడంతో పరిస్థితులు మారాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులకు ఈ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఫలితంగా ఇంధన ధరలు పెరిగాయి.

జెలెన్‌స్కీ, ట్రంప్ మధ్య నెలకొన్న ఈ వివాదం మరో కీలక సమయంలో చోటుచేసుకుంది. అమెరికాలో జీవన వ్యయాల పెరుగుదలపై ఓటర్లలో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో, హోరాహోరీగా సాగనున్న అమెరికా ఎన్నికలకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అక్కడ ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు, ప్రపంచ ఇంధన సరఫరా, ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మొత్తంగా చూస్తే, రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, అందుకు రష్యా కూడా తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఉద్రిక్తతల తగ్గింపు ఏకపక్షంగా కాకుండా, ఇరు దేశాల నుంచి పరస్పర చర్యలతో పాటు విశ్వసనీయమైన హామీల ఆధారంగా జరగాలని ఆయన కోరుతున్నారు.

ఇదీ చదవండి: జెలెన్‌స్కీకి ట్రంప్ షాక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement