మహా నిరసనకు ఫ్రాన్స్‌ సిద్ధం!  | France to mobilise 70,000 security forces for Saturday protest | Sakshi
Sakshi News home page

మహా నిరసనకు ఫ్రాన్స్‌ సిద్ధం! 

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

France to mobilise 70,000 security forces for Saturday protest

శనివారం భారీ ఆందోళనలకు పిలుపు 

హింసను సహించబోమని ప్రభుత్వం స్పష్టీకరణ 

70 వేల మంది సిబ్బంది మోహరింపు 

పలు మ్యూజియమ్‌ల మూసివేత 

పారిస్‌: ఫ్రాన్స్‌లో శనివారం నాటి మహా నిరసన ప్రదర్శనలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భద్రత పర్యవేక్షణ కోసం సుమారు 70 వేల మంది బలగాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ విర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ప్రపంచప్రఖ్యాత లోవర్‌తోపాటు ఇతర మ్యూజియమ్‌లను కూడా ముందుజాగ్రత్త చర్యగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గత వారాంతంలో చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 ఫ్రాన్స్‌లో కొన్నేళ్లుగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. విద్యా వ్యవస్థలో మార్పులు, అధిక నిధుల డిమాండ్లతో మొదలైన ఈ ఆందోళనలు గత వారాంతం హింసాత్మకంగా మారాయి. దుండగులు కొందరు ప్రభుత్వ భవనాల్లోకి దూసుకెళ్లి ఆస్తి నష్టానికి కారణమయ్యారు. కొన్నిచోట్ల ఆస్తులకు నిప్పు పెట్టారు. దుకాణాల అద్దాలు బద్దలు కొట్టడంతోపాటు లూటీకి పాల్పడినట్లు వార్తలొచ్చాయి. 

తాజాగా శనివారం మరో పెద్ద నిరసన 
కార్యక్రమానికి ఆందోళనకారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. 2018, 2019లలో అధిక ధరల నియంత్రణ డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టిన ‘ఎల్లో వెస్ట్‌’బృందం కూడా శనివారం నాటి కార్యక్రమానికి మద్దతు తెలిపింది.  ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెండ్‌ నూనెజ్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం నాడు హెలికాప్టర్లతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. 

అంతేకాకుండా 70 వేల మంది సిబ్బందిపి శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగిస్తున్నామని సాయుధ వాహనాలు, జలఫిరంగులు, ప్రత్యేక పోలీసు బలగాల సేవలూ వినియోగించుకుంటుఆమని వివరించారు. వామపక్ష భావాలున్న వారు సోషల్‌ మీడియాలో హింస, ఆస్తి విధ్వంసాలకు పిలుపునిచ్చారని, లూటీలకు పాల్పడాలన్న మెసేజీలు కూడా చక్కర్లు కొడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇవన్నీ ఆందోళనకారులు వ్యాప్తి చేస్తున్నవేనని అన్నారు. అయితే ప్రభుత్వం కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోదని స్పష్టం చేశారు. హింసకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, అరెస్టులు, చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.  

పారిస్‌ శివార్లలో కాల్పులు.. ఒకరి మృతి 
ఫ్రాన్స్‌ రాజదాని పారిస్‌ శివార్లలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. కాల్పులకు జాతి వివక్ష కారణమా? అన్నది నిర్ధారించనుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. 

పారిస్‌ సమీపంలోని ట్రాపెస్, లా విరెరీలలో మూడు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని, మిలటరీలో ఉపయోగించే లేంటే ఆటోమెటిక్‌ ఆయుధంతో అనుమానితుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిసిందని ట్రాపెస్‌ మేయర్‌ అలీ రబే తెలిపారు. నిందితుడు చుట్టుపక్కల ఉన్నవారిపై యధాలాపంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఒకరు మాత్రమే మరణించడం ఒక అద్భుతమనే చెప్పాలని వ్యాఖ్యానించారు. మరణించిన వ్యక్తి ఆఫ్రికా సంతతి వారని, తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాడని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement