ఓపెన్‌! | Sakshi
Sakshi News home page

ఓపెన్‌!

Published Mon, Mar 25 2024 12:30 AM

- - Sakshi

నైట్‌ ఎకానమీపై రేవంత్‌ సర్కార్‌ దృష్టి

రాత్రి బజార్‌లకు అనుమతిచ్చే యోచన

అర్ధరాత్రి కూడా ఫుడ్‌, షాపింగ్‌ చేసుకునే వీలు

శిల్పారామం, చార్మినార్‌, గోల్కొండ ప్రాంతాలలో నైట్‌ బజార్లు

రవాణా, పర్యాటక, వినోద రంగాల అభివృద్ధి

వైన్స్‌, బార్లు, పబ్‌లకు నో పర్మిషన్‌

సాక్షి, సిటీబ్యూరో: త్వరలోనే 24 గంటల పాటూ వాణిజ్య, వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచే సదుపాయం అందుబాటులోకి రానుంది. నైట్‌ ఎకానమీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోజంతా వ్యాపార సంస్థలకు అనుమతిస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. పర్యాటక, రవాణా రంగాలతో పాటు లాజిస్టిక్‌ విభాగం వృద్ధి చెందుతుంది. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, వినోద రంగాలు వృద్ధి చెందుతాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో వ్యాపార సంస్థలకు 24/7 విధానం అమలులో ఉంది.

ఇప్పటికే దరఖాస్తులు కూడా..

వాస్తవానికి నైట్‌ ఎకానమీ అనేది గతేడాది శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వ ఆలోచనే. ఈమేరకు తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం–1988లోని కొన్ని సవరణలు చేస్తూ కార్మిక శాఖ గతేడాది ఏప్రిల్‌లో జీఓ సైతం జారీ చేసింది. రూ.10 వేలు వార్షిక రుసుముగా నిర్ణయించింది. ఇప్పటికే బ్లింక్‌ కామర్స్‌, టాటా స్టార్‌ బక్స్‌, రెడ్‌ రోజ్‌ వంటి పలు సంస్థలు ఔట్‌లెట్లు, కాఫీ షాపులు, సూపర్‌ మార్కెట్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. స్వయం సహాయక బృందాల మహిళలు వారి ఉత్పత్తులను విక్రయాలకు వీలుగా శిల్పారామం, చార్మినార్‌, గొల్కొండ వంటి పర్యాటక ప్రాంతాలలో నైట్‌ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలకు మాత్రం నైట్‌ ఎకానమీలో అనుమతి లేదు.

నేరాలు పెరిగే ప్రమాదం..

నైట్‌ ఎకానమీకి అనుమతిస్తే మద్యం విక్రయాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసు శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత్తులో హింస, నేరాలకు పాల్పడే ప్రమాదాలుండటంతో ప్రత్యేకించి హోటళ్లు, రెస్టారెంట్లలో రాత్రి పూట గొడవలు, హత్యలు వంటి నేరాలు పెరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసు శాఖ వెంటనే సంబంధిత యాజమాన్యం అనుమతులను రద్దు చేస్తుంది.

దుకాణ యాజమాన్యం, ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలి.

ప్రత్యేకంగా పని గంటలు, సెలవులను కేటాయించాలి.

జాతీయ సెలవు దినాలు, పండగ రోజుల్లో పని చేసే వారికి వేతనంతో కూడిన పరిహారం సెలవులను అందించాలి.

నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసేందుకు మహిళ ఉద్యోగులను ముందస్తు అనుమతి కోరాలి. వారికి రవాణా సేవలు, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే.

యాజమాన్యం విధిగా రికార్డులను మెయింటెన్‌ చేయాలి.

పోలీసు చట్టం, నిబంధనలకు లోబడే ఆయా యాజమాన్యాలు కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement