84 ఏళ్లకు స్పైన్‌ సర్జరీ.. 48 గంటల్లోనే వాకింగ్‌! | Successful spine surgery performed on an 84 year old woman in Mumbai | Sakshi
Sakshi News home page

84 ఏళ్లకు స్పైన్‌ సర్జరీ.. 48 గంటల్లోనే వాకింగ్‌!

Oct 25 2026 5:50 AM | Updated on Oct 25 2026 5:50 AM

Successful spine surgery performed on an 84 year old woman in Mumbai

వెన్నెముకలో ఒకచోట (టీ12) ఏర్పడిన పగులు కారణంగా తీవ్ర నొప్పి, కాళ్లలో తిమ్మిర్లతో బాధపడుతున్న ఓ 84 ఏళ్ల వృద్ధురాలికి ముంబైలోని ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా స్పైన్‌ సర్జరీ నిర్వహించడమే కాకుండా 48 గంటల్లోనే ఆమె వాకర్‌ సాయంతో నడిచేలా చేయగలిగారు. ఈ సర్జరీ గురించి ఆస్పత్రి కన్సల్టెంట్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ కునాల్‌ సింగ్‌ మాట్లాడుతూ శస్త్రచికిత్స వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కేవలం రోగి వయసునే పరిగణనలోకి తీసుకోరాదని.. రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితి, గాయం తీవ్రత, చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, వైద్యుల పర్యవేక్షణలో అందించే పునరావాస చికిత్స (రీహ్యాబిలిటేషన్‌) రోగులు కోలుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అలాగే వృద్ధులు వీలైనంత వరకు ఇతరులపై ఆధారపడకుండా జీవించడానికి ఈ తరహా సర్జరీలు తోడ్పడతాయని చెప్పారు. అయితే శస్త్రచికిత్స తర్వాత రోగి ఎంత త్వరగా కోలుకుంటారనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని, ఒక రోగిలో కనిపించిన చికిత్స ఫలితం అందరికీ వర్తిస్తుందని భావించరాదని డాక్టర్‌ కునాల్‌ సింగ్‌ తెలిపారు. 

ఆర్థరైటిస్‌.. నో వర్రీస్‌ 
ఆర్థరైటిస్‌ (కీళ్ల వాపు, నొప్పులకు సంబంధించిన సమస్యలు) బాధితుల్లో aచాలా మంది రోజువారీ వ్యాయామాలు, శారీరక శ్రమకు దూరంగా ఉంటుంటారు. ఒకవేళ కసరత్తులు చేస్తే కీళ్లు మరింతగా బిగుసుకుపోయి సమస్య జటిలం అవుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. అయితే సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం ఆర్థరైటిస్‌ సమస్యను అదుపులో పెట్టడానికి తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తే కీళ్ల కదలికలు మెరుగుపడటంతోపాటు కీళ్లు బిగుసుకుపోయిన భావన కూడా తగ్గుతుందని అంటున్నారు.

చదునుగా ఉన్న నేలపై నడవడం, నీళ్లలో ఈత కొట్టడం, మెల్లగా సైకిల్‌ తొక్కడం, వైద్యులు లేదా ఫిజియోథెరపిస్టుల సూచన ప్రకారం కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం, యోగా, తాయ్‌చీ, స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజులు శరీర సమతుల్యతను, కదలికలను మెరుగుపరచడానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు. అయితే వ్యాయామం చేసేటప్పుడు నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వ్యాయామాలను ఆపడం, నొప్పి కలగని విధంగా వ్యాయామాలను మార్చుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తీవ్రమైన నొప్పి, కదలికల్లో ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు కొత్తగా వ్యాయామాలు ప్రారంభించే ముందు వైద్యుడిని లేదా ఫిజియోథెరపిస్టును సంప్రదించడం మంచిదని అంటున్నారు.

సర్కాడియన్‌ డిప్రెషన్‌!
సాధారణంగా డిప్రెషన్‌ బాధితుల్లో కనిపించే అలసట.. కొందరిలో నిద్రలేమి సమస్యల వల్ల కాకుండా శరీరంలోని జీవగడియారం పనితీరులో మార్పుల వల్ల కూడా సంభవించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి నలుగురు డిప్రెషన్‌ బాధితులకుగాను ఒకరిలో నిద్ర, మెలకువ, హార్మోన్ల విడుదల వంటి అనేక శారీరక పనులను నియంత్రించే ఈ జీవగడియారం పనితీరులో మార్పులు కనిపించినట్లు 11 వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాల ఆధారంగా దీన్ని సర్కాడియన్‌ డిప్రెషన్‌ అనే కొత్త రకాన్ని ప్రతిపాదించారు. 

ఈ సహజమైన జీవ గడియారం పనితీరు మన రోజువారీ పనుల సమయాలకు లేదా పరిసర పరిస్థితులకు సరిపోకపోతే రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోవడం, పగటిపూట చురుగ్గా ఉండటంలో ఇబ్బందులు వస్తాయి. కొన్ని రకాల డిప్రెషన్‌లలో ఇవే మార్పులు రావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. డిప్రెషన్‌ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఎందుకు కనిపిస్తుంది? బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స ఎందుకు పనిచేయదనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఫలితాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనం వివరాలు ‘ది బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రీ’లో ప్రచురితమయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement