ఢిల్లీలో అక్టోబర్ 16 నాటి సి.జె.పి. ‘లెహ్రా దో తిరంగా’ ప్రదర్శన
ఈ నెల 16న మరొక వెల్లువ. సరిగా అయిదు నెలల క్రితం మే 16న కాక్రోచ్ జనతా పార్టీ (సి.జె.పి.) ఉనికిలోకి వచ్చి నప్పటి నుంచి దేశ యువతరం వెల్లువ తర్వాత వెల్లువలా కదలి వస్తూనే ఉంది. వారిని నిలువరించేందుకు, అణచి వేసేందుకు, ప్రభుత్వం ప్రతిసారి వేలాదిగా పోలీసు బలగాలను మొహరిస్తున్నది. రకరకాల చట్టాలను ప్రయోగిస్తున్నది. యువతీయువకులు, వారి వెంట నిలిచే పెద్దలు ఎన్ని దెబ్బలైనా తింటున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్నారు. 16న వెల్లువ రోజు ప్రధాన నాయకులంతా నిర్బంధంలో ఉన్నారు కూడా.
ఎనభై ఏళ్లలో అసాధారణ పరిణామం
ఈ వెల్లువల నిర్వచనమేమిటి? ఇవి, ‘నీట్’తో మొదలైన నిరసనలు మాత్రమేనా? తమ జీవితాలకు పునాదులు వేసే ప్రభుత్వ పాఠశాలల అధ్వాన్న స్థితిపై గళం విప్పటం ఒక్కటేనా? దేశ ప్రజా స్వామిక వ్యవస్థను నిర్దేశించుకునేందుకు తమకు, తమ తల్లిదండ్రు లకు ఏకైక సాధనమయే ఓటు హక్కును పరిరక్షించుకునే ఆరాటానికి మించి మరేమీ లేదా? ఈ అయిదు మాసాల వరుస వెల్లువలతో సి.జె.పి. నుంచి ఇంకా అనేకం వినిపించాయి. దేశాన్ని, సమాజాన్ని, పౌరులుగా వ్యక్తులను వేధిస్తున్న విషయాలలో వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావించనివి లేవేమో. ఈ వెల్లువలో అవన్నీ మిళితమై ఉన్నట్లు తోస్తున్నది.
దేశం స్వతంత్రమైన 80 సంవత్సరాలలో ఇది పూర్తిగా ఒక కొత్త స్థితి. అనేక విషయాలపై అనేక నిరసనలు, ఉద్యమాలను ఈ దేశం చూసింది. అవి అన్నీ ఒకటి రెండు సమస్యలకు పరిమితమైనవి. ఇపుడు చూస్తున్నది వాటికి భిన్నమైనది. మౌలికంగానే భిన్నమైనది. పైన చెప్పుకున్నట్లు దీనిలో సమస్తం మిళితమైనట్లు కనిపిస్తున్నది. అట్లా ఎందుకు జరుగుతున్నది, భూమి అడుగున అనేక ప్రకంపనాల తర్వాత భారీ భూకంపం బద్ధలైనట్లు! జూలై 20 నాటి సి.జె.పి. చలో పార్లమెంట్ మిలిటెంట్ ప్రదర్శన నుంచి, ఈ నెల 16న కన్నాట్ ప్లేస్‌లో పూర్తి శాంతియుతమైన ‘లెహ్రా దో తిరంగా’ వరకు యువత వెల్లువలకు గానీ, ప్రతిసారీ వేలాది పోలీసు బలగాల వినియోగానికి గానీ నిర్వచనాలేమిటి? వాటి లోతేమిటి?
మనకు కనిపించీ కనిపించక బోధపడీ పడక ఏవో జరుగు తున్నాయి. లేనట్లయితే, 80 సంవత్సరాలు గడిచాక ఇటువంటి అసాధారణ పరిస్థితి ఉత్పన్నమయేది కాదు. కొంత లోతుగా ఆలో చించినప్పుడు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సి.జె.పి. సవాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ‘ఎస్.ఐ.ఆర్.’ ప్రక్రియకు, తద్వారా బీజేపీ అధికారానికి సంబంధించినది మాత్రమే కాదు. దానితో పాటు, అంతకన్నా ముఖ్యంగా, దేశంలో హిందూ రాష్ట్ర స్థాపన ప్రణాళిక సజావుగా సాగుతున్నట్లు తోస్తుండగా, అందుకు ఈ యువతరం వెల్లువలు భంగం కలిగిం చేట్లు కూడా కనిపిస్తున్నాయి. అట్లా అనిపించటానికి గల కొన్ని కారణాలను చూద్దాము.
పార్టీలకు దూరంగా స్వతంత్ర వైఖరి
తమ అధికార పరిరక్షణకు, దానితో పాటు హిందూ రాష్ట్ర లక్ష్యం సులభమయేందుకు సంఘ్ పరివార్ ఎన్నుకున్న సాధనాలలో ఒకటి, యువతరాన్ని ఆకర్షించి తమ వెంట నిలుపుకోవటం.రెండవది, హిందూ–ముస్లిం ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగించటం. సి.జె.పి.కి ముందు ఇవి రెండూ విజయవంతంగా సాగుతుండేవి. కానీ, అభిజిత్ దీప్కే జూన్ 6న వచ్చిన వెంటనే ఈ రెండు వ్యూహాలూ భంగపడటం మొదలైంది. యువతీయువకులు స్వీయ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా అతడి వైపు ఆకర్షితులు కాసాగారు.
సి.జె.పి. నినాదాలు, కార్యక్రమాలు, పట్టుదల, అణచి వేతలను తట్టుకుని నిలిచే ధైర్యం, రాజీలేనితనం, రాజకీయ పార్టీ లతో చేరకుండా స్వతంత్ర వైఖరి తీసుకోవటం, దూకుడును చూప కుండా సరైన ఆలోచనలూ సంప్రదింపులతో ముందుకు సాగటం, శాంతియుత ఆందోళనలు అవసరమని పదే పదే నొక్కి చెప్పటం వంటివి యువతరానికే గాక, ఆలోచనాపరులకు, సాధారణ ప్రజ లకు కూడా ఆకర్షణను పెంచాయి.
ఆ విధంగా యువతరం తమ పట్టు నుంచి దూరమవుతుండటం సంఘ్ పరివార్‌కు, బీజేపీకి ఆందోళనకరమైంది. దానికి మరొకటి కూడా తోడైంది. వారు తమ సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేందుకు గాంధీజీపై, అంతకు మించి నెహ్రూపై ఎప్పటి నుంచో వ్యతిరేక ప్రచారాలు సాగిస్తున్నారు. అంబేడ్కర్ విషయంలో ఆ పని చేయటం ప్రమాదకరం గనుక ఆయనను ‘స్వంతం’ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
ఆయన ముస్లిములకు వ్యతిరేకి అనే ప్రచారాలూ మొదలు పెట్టారు. మరొక వైపు నుంచి, సర్దార్ పటేల్ అందరికన్నా ముఖ్యుడని ముందుకు తేసాగారు. ఆ వాతావరణం కూడా దీప్కే బృందం నాయకత్వాన చెదిరిపోవటం మొదలైంది. ‘‘ఈ దేశానికి ఆత్మ గాంధీజీ, వెన్నెముక అంబేడ్కర్, మేధస్సు నెహ్రూ’’ అన్నది సి.జె.పి. నినాదంగా మారి యువతను మెప్పించే ధోరణి కనిపించింది. గమనించవలసిందేమంటే, ఇటు వంటి మలుపును ఇంత బలంగా కాంగ్రెస్ సహా ఏ పార్టీలు కూడా తీసుకురాలేక పోయాయి.
గత నిరసనలకు భిన్నమైన వెల్లువ
వీటన్నిటి కన్నా సీరియస్ విషయం ఒకటున్నది. అభిజి™Œ దీప్కే జూన్ 6న అమెరికా నుంచి వచ్చి జంతర్ మంతర్ వద్ద చేసిన మొట్టమొదటి ప్రసంగంలోనే, ‘‘పదేళ్లు హిందూ–ముస్లిం రాజ కీయం చేయటం, యువకులను తప్పు దారి పట్టించి ఓట్లు సంపా దించటం మినహా, యువతరం కోసం మీరు చేసిందేమిటి?’’ అని ఎలుగెత్తి ప్రశ్నించారు. తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ, గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ 2 నాడు అదే అంశంపై ముంబై శివాజీ పార్కులో చేసిన తీవ్ర ప్రసంగమైతే అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ ప్రసంగంలో పరివార్ లక్ష్యాలకు, భారత ప్రజాస్వామ్యా నికి మధ్య గల మౌలిక వైరుధ్యం తీవ్రరూపం తీసుకోవటం కనిపిస్తున్నది.
యువతరం వెల్లువల వెనుక మరొక పరిణామక్రమం కూడా ఉందనిపిస్తున్నది.
అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేసిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ భూపీందర్ సింగ్, సి.జె.పి.కి మద్దతుగా ఒక వ్యాసం రాస్తూ, వి.ఎస్. నైపాల్ రాసిన ‘ఇండియా, ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ పుస్తకం నుంచి కొన్ని వ్యాఖ్యలను పేర్కొన్నారు. నైపాల్ రచన 1990 నాటిది. అయినా, ఈ దేశ యువత, సమాజం పలు విధాలైన ఘర్షణలు, క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పుల గురించి నైపాల్ చేసిన గొప్ప పరిశీలనలు, ప్రస్తుతం మనం చూస్తున్న వరుస వెల్లువలకు తెర తీసినట్లుగా కనిపిస్తుంది. పైన అనుకున్నట్లు, ఈ వెల్లువలు గత నిరసనల కన్నా భిన్నమైనవి. వీటిలో అనేక కొత్తదనాలున్నాయి. అవి ఏ విధమైన రూపు తీసుకోవచ్చనది మాత్రం చెప్పలేని విషయం.
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
విశ్లేషణ: టంకశాల అశోక్


