యాభై ఏళ్ల సాధికారతకు చిహ్నాలు | Empowering tribal women in the Sundarbans | Sakshi
Sakshi News home page

యాభై ఏళ్ల సాధికారతకు చిహ్నాలు

Oct 24 2026 4:57 AM | Updated on Oct 24 2026 4:57 AM

Empowering tribal women in the Sundarbans

రంగ్‌బెలియా మహిళలు

సుందర్‌బన్‌ దీవుల్లో రంగ్‌బెలియాది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు మూఢాచారాలు, భూతవైద్యాలకు నిలయమైన ఈ దీవి ఇప్పుడు సాధికార మహిళల నిలయం. యాభై ఏళ్ల కిందట స్థాపించిన రంగబెలియా మహిళా ఇండస్ట్రియల్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ సుందరబన్స్ మహిళల ఆర్థిక సాధికారతకు ఆలంబన. 

పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్స్ డెల్టా ప్రాంతం పర్యాటకానికి, ప్రకృతి అందాలకు ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడ నివసించే ప్రజలకు కష్టాలు కూడా అంతే ఎక్కువ. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, భూతవైద్యం వంటి సామాజిక దురాచారాల మధ్య బతుకు సాగించేవాళ్లు. సామాజిక అనారోగ్యం ఎప్పుడైనా ఎక్కడైనా సరే అది మహిళల ప్రాణాల మీదకే తెస్తుంది. 

మానసికంగా న్యూనతకు గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 1968లో తుషార్‌ కంజీలాల్‌ అనే సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడిగా ఆ ఊరికి రావడం ఆ ఊరి స్వరూపాన్ని మార్చింది. మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూర్చడంలో తుషార్‌ కంజీలాల్‌ సతీమణి బినా కంజీలాల్‌ చొరవ, ముందుచూపును ఇప్పటికీ ఆ గ్రామ మహిళలు తలుచుకుంటున్నారు. 

తుషార్‌ కంజీలాల్‌ సామాజికాభివృద్ధి కోసం ‘టాగోర్‌ సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌’ ఎన్‌జీవోను స్థాపించారు. బినా కంజీలాల్‌ మొదట మహిళలను ఒక త్రాటి మీదకు తెచ్చి పాడితో ఉపాధి పొందడాన్ని నేర్పించారు, ఆ తర్వాత పంటను నిల్వ చేసి అమ్మడం నేర్పించారు. ఆ తర్వాత ఆర్థిక సాధికారత సాధించిన తల్లులను చైతన్యవంతం చేసి వారి దృష్టిని బాలిక విద్య మీదకు మళ్లించారు. మహిళాభివృద్ధి కోసం 1976లో ఆ ఊరిపేరుతోనే సహకార సంఘాన్ని స్థాపించారు. రంగ్‌బెలియా మహిళా కోఆపరేటివ్‌ సొసైటీ యాభై ఏళ్లుగా వెనుకబడిన మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. పేదరికాన్ని రూపుమాపడంతోపాటు, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహకరిస్తోంది.

సంప్రదాయ హస్తకళలతో ఉపాధి!
సుందరబన్స్ ప్రాంతంలోని గ్రామీణ మహిళలకు వివిధ రకాల హస్తకళలు, కుట్టుపనులు, వస్త్రాల మీద బీస్‌ వ్యాక్స్‌ పెయింటింగ్‌తోపాటు హ్యాండ్‌ బాతిక్, కలంకారీలలో మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న మహిళలు చీరెలు, బ్యాగ్‌లు, ర్యాప్‌ అరౌండ్‌లు చేస్తున్నారు. అడవుల్లో దొరికే సహజసిద్ధమైన తేనె సేకరించి శుద్ధి చేస్తున్నారు. బెంగాల్‌ సంప్రదాయ చేనేత జామ్‌దానీ చీరెలు నేస్తున్నారు. 

నిరక్షరాస్యుల నుంచి గ్రాడ్యుయేట్‌ల వరకు మొత్తం 470 మంది మహిళలు ఇందులో సభ్యులు. అభ్యుదయపథంలో నడుస్తున్న ఈ మహిళల చైతన్యాన్ని తెలుసుకోవడానికి స్వాతంత్య్ర సమరయోధుడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ స్వయంగా ఇక్కడికి విచ్చేశారని మహిళలు ఆఫీస్‌ గదిలో ఉన్న ఫొటో చూపించి చెప్పారు. మహిళాభ్యుదయానికి పథనిర్మాణం చేసి, తాము ఆత్మగౌరవంతో బతికేందుకు మార్గం సుగమం చేసిన తుషార్‌ కంజీలాల్‌ను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించిందని రంగ్‌బెలియా గ్రామ మహిళలు సంతోషంగా చెప్పారు.

ఊరిని నిర్మలంగా మార్చింది 
రంగ్‌బెలియా గ్రామంలో అందరూ బినా కంజీలాల్‌ వేసిన మార్గంలో నడుస్తున్న చైతన్యవంతమైన మహిళలే. వారిలో గౌరీ కథువా సామాజిక కార్యకర్త. ఆమె రంగ్‌బెలియా గ్రామానికి రెండు దఫాలు పంచాయితీ ప్రధాన్‌గా సేవలందించారు. తన గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మార్చడంలో నూటికి నూరుశాతం విజయవంతమయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 2005లో ‘నిర్మల్‌ గ్రామ్‌ పురస్కార్‌’ అందుకున్నారు.

దీవికి దివిటీ
‘‘2003కి ముందు ఈ దీవుల్లోని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా ఉండేది. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం అనే పరిశుభ్రత ఉద్యమంలో స్థానికులను భాగస్వామ్యం చేశాను. బహిరంగ మల విసర్జన కారణంగా అంటువ్యాధులతోపాటు అనారోగ్యాలు పొంచి ఉండేవి. ఆ సమయంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కట్టుకునే విధంగా మహిళలను చైతన్యవంతం చేశాను. గ్రామ ప్రధాన్‌ (సర్పంచ్‌)గా గ్రామంలో పరిశుభ్రతను ఒక ఉద్యమంగా చేపట్టాను. పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌లలోనూ పారిశుద్ధ్య సౌకర్యం కల్పించాం. వ్యక్తిగత పరిశుభ్రత, తాగునీటి భద్రత, ఘన వ్యర్థాల నిర్వహణలోనూ గ్రామాన్ని ముందు వరుసలో నిలపడం వల్ల మా గ్రామం ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది.
– గౌరీ కథువా, మాజీ ప్రధాన్, రంగబెలియా పంచాయితీ, వెస్ట్‌బెంగాల్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement