ఈ పతనం ఏ లోతుల్లోకి? | Sakshi Editorial On TDP Coalition government by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఈ పతనం ఏ లోతుల్లోకి?

Jun 8 2025 12:58 AM | Updated on Jun 8 2025 12:58 AM

Sakshi Editorial On TDP Coalition government by Vardhelli Murali

జనతంత్రం

కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.

గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్‌స్పెక్టర్‌కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్‌ టీవీల్లో కనిపించాయి.

తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్‌కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్‌ మీద ఆ ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్‌ సివిల్‌ డ్రెస్‌లో ఉంటూనే, లా అండ్‌ ఆర్డర్‌ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్‌ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! 

ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక  న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.

కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్‌ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్‌ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. 

అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. 

ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్‌ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్‌ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.

ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్‌ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్‌ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. 

చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్‌ హెడ్‌ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్‌ వేశారని ఆ పత్రిక రాసింది. 

ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్‌కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.

నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. 

విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్‌ చేశారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. 

అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్‌ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.

ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. 

రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్‌ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. 

దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్‌కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్‌ ట్రాఫిక్‌ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!

ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్‌ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్‌ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. 

విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.

ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.

ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. 

వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్‌.ఎస్‌. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్‌ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement