పులి పేరిట ఆటలు.. | Sakshi
Sakshi News home page

పులి పేరిట ఆటలు..

Published Mon, May 27 2024 6:05 PM

పులి

ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు పులి సంచరిస్తోందనితప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్‌గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు.

చిత్తూరు కార్పొరేషన్‌: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు.

జిల్లాలో ఇలా..

● చిత్తూరు రూరల్‌ మండలం బీఎన్‌ఆర్‌పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్‌ టైగర్‌ కనిపించిందని వీడియోను వైరల్‌ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్‌లోడ్‌ చేసినట్లు అధికారులు తేల్చారు.

● గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్‌ టైగర్‌ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లో తీసినట్లుగా గుర్తించారు.

● గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్‌ఆర్వో థామస్‌ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్‌ రేంజ్‌లో వైరల్‌ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్‌ చేసినట్లు తెలుస్తోంది.

● పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్‌ వీడియో అని అధికారులు తేల్చారు.

● వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ సురేష్‌ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్‌స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్‌ స్టేటస్ట్‌లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.

మీతిమిరుతున్న ఆకతాయిల ఆగడాలు

భయాందోళనలో జనం

క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫేక్‌గా నిర్ధారిస్తున్న అటవీశాఖ అధికారులు

ఘటనలపై అటవీశాఖ సీరియస్‌

చర్యలు తప్పవు

ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి.

– థామస్‌, ఎఫ్‌ఆర్వో, చిత్తూరు ఈస్ట్‌

పులి పేరిట ఆటలు..
1/3

పులి పేరిట ఆటలు..

పులి పేరిట ఆటలు..
2/3

పులి పేరిట ఆటలు..

పులి పేరిట ఆటలు..
3/3

పులి పేరిట ఆటలు..

Advertisement
 
Advertisement
 
Advertisement