పుష్పపల్లకీపై ద్రౌపదీదేవి విహారం | Sakshi
Sakshi News home page

పుష్పపల్లకీపై ద్రౌపదీదేవి విహారం

Published Sat, May 25 2024 1:35 AM

పుష్పపల్లకీపై ద్రౌపదీదేవి విహారం

● వైభవంగా అర్జున తపస్సుమాను ● యామిగానిపల్లెలో భక్తజన సందడి

గుడుపల్లె: మండలంలోని యామగానిపల్లెలోని శ్రీ ద్రౌపదీ ధర్మారాజస్వామి ఆలయ మహా భారత మహాత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పుష్పపల్లకి సేవ, మధ్యాహ్నం అర్జున తపస్సుమాను కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అర్జున తపస్సుమాను ఘట్టం ప్రారంభమైంది. అర్జున వేషధారి తపస్సుమాను చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. పరమశివుని వరం పొందేందుకు పద్యాలతో కీర్తిస్తూ తపస్సుమాను అధిరోహించారు. అక్కడి నుంచి నిమ్మపండ్లు, విబూతిపండ్లు భక్తులపై విసిరారు. వాటిని అందుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. సంతాన వరం కోరుతూ పలువురు మహిళలు తపస్సుమాను చుట్టూ వరపడ్డారు. తపస్సు మాను ఘట్టం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా విచ్చేశారు. రాత్రి పుష్పపల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పల్లకిపై కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, బాణ సంచా పేలుళ్ల సందడి నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement