జియో ప్లాట్‌ఫామ్స్‌ @ రూ. 1,065–1,119 | Mukesh Ambani Jio Platforms IPO Launch, set for 21 October 2026 | Sakshi
Sakshi News home page

జియో ప్లాట్‌ఫామ్స్‌ @ రూ. 1,065–1,119 

Oct 15 2026 5:03 AM | Updated on Oct 15 2026 5:03 AM

Mukesh Ambani Jio Platforms IPO Launch, set for 21 October 2026

ఈ నెల 21–23 మధ్య ఐపీవో 

రూ. 30,213 కోట్ల సమీకరణ 

ఉద్యోగులకు రూ. 54 డిస్కౌంట్‌ 

రిటైలర్లకు 12 షేర్లు ఒక లాట్‌

ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో పట్టాలెక్కింది. ఇష్యూ ఈ నెల 21న ప్రారంభం కానున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. ఇష్యూకి రూ. 1,065–1,119 ధరల శ్రేణి ప్రకటించింది. తద్వారా రూ. 30,213 కోట్లు సమీకరించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది.  

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి  రూ. 1,065–1,119 ధరల శ్రేణి ప్రకటించింది. ఇందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 19న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 27 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనున్నట్లు తుది ప్రాస్పెక్టస్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. 

తద్వారా రూ. 30,213 కోట్లు సమీకరించనుంది. దీంతో ఇంతక్రితం(2024లో) రూ. 27,879 కోట్లు సమీకరించిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా రికార్డ్‌ సృష్టించే అవకాశముంది. ఈ ఇష్యూ ద్వరా కంపెనీ విలువ రూ. 10 లక్షల కోట్లకుపైగా చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ ఐపీవోలు హ్యుందాయ్‌ మోటార్, ఎల్‌ఐసీ (రూ. 20,557 కోట్లు) ఆఫర్లలో ప్రమోటర్లు వాటాలు విక్రయించగా.. జియో తాజా ఈక్విటీ జారీతో నిధులు సమీకరిస్తుండటం గమనార్హం!  

28కల్లా లిస్టింగ్‌...
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈ నెల 28కల్లా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. అర్హతగల ఉద్యోగులకు ఒక్కో షేరుకి రూ. 54 చొప్పున డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ పరిమాణంలో రిలయన్స్‌ వాటాదారులకు రూ. 2,500 కోట్లు, జియో ఉద్యోగులకు రూ. 500 కోట్లు విలువైన షేర్లను రిజర్వ్‌ చేసింది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. 

గతేడాది (2025–26) జియో ప్లాట్‌ఫామ్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 30,049 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం వృద్ధితో రూ. 1,46,885 కోట్లకు చేరింది. 52.4 కోట్లమందికిపైగా సబ్‌్రస్కయిబర్లను కలిగి ఉంది. 2026 జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 214 ఏఆర్‌పీయూ సాధించింది. మొత్తం రుణాలు 3 శాతం తగ్గి రూ. 70,781 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జూన్‌ 19న క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయడం ద్వారా ఐపీవోకు ఆగస్ట్‌లో అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 66.43 శాతంకాగా.. గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు మెటా, గూగుల్‌ సంయుక్తంగా 17.7 శాతం వాటా పొందాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement