ఇంటెల్‌లో ఉద్యోగాల కోత ప్రారంభం | Intel shift by shutting down its automotive chip division | Sakshi
Sakshi News home page

ఇంటెల్‌లో ఉద్యోగాల కోత ప్రారంభం

Jun 26 2025 3:05 PM | Updated on Jun 26 2025 3:15 PM

Intel shift by shutting down its automotive chip division

ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం  కంపెనీ సమర్పించిన ఫైలింగ్‌లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.

జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్‌ ఎక్స్‌పర్ట్‌ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు

తాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్‌షిప్‌ రోల్స్‌లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్‌లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్‌ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్‌ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి.

Advertisement
 
Advertisement
Advertisement