పెట్టుబడులకు కాస్త స్థిరత్వం | Canara Robeco Equity Hybrid Fund | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు కాస్త స్థిరత్వం

May 5 2025 1:33 AM | Updated on May 5 2025 6:57 AM

Canara Robeco Equity Hybrid Fund

కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌

పెట్టుబడులకు వైవిధ్యం ఎంత అవసరమో ఇటీవలి మార్కెట్‌ పతనం చూసి తెలుసుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌తో పోల్చితే మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో గణనీయమైన దిద్దుబాటు కనిపించింది. పెట్టుబడులపై మెరుగైన రాబడులు కోరుకోవడంలో తప్పులేదు. అదే సమయంలో ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు స్థిరత్వం కూడా అవసరమే. కనుక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే ప్రతి ఒక్కరూ నిర్ణీత శాతం మేర డెట్‌ సాధనాలకూ కేటాయించుకోవాలి. ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఇదే పని చేస్తాయి. ఇవి ఈక్విటీతోపాటు కొంత మేర డెట్‌ సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడిపై మెరుగైన రాబడికి తోడు అస్థిరతల్లో మెరుగైన రక్షణను ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ మెరుగైన పనితీరు చూపిస్తోంది.  

రాబడులు 
ఈ పథకంలో ఏడాది కాల రాబడి 10 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లలో అస్థిరతలు, దిద్దుబాట్ల నేపథ్యంలో దీన్ని మెరుగైన రాబడిగానే చూడొచ్చు. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఏటా 14 శాతానికి పైనే రాబడి తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో 18.55 శాతం, ఏడేళ్లలో 13.95 శాతం, పదేళ్లలో 13.45 శాతం చొప్పున ఈ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌లో రాబడులు కనిపిస్తాయి.  

పెట్టుబడుల విధానం 
అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకాలు ఈక్విటీ, డెట్‌ కలయికగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీల వ్యాల్యుయేషన్స్‌ (స్టాక్స్‌ విలువలు) ఆకర్షణీయంగా ఉన్న సందర్భాల్లో మొత్తం పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి మిగిలిన 20 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అదే విధంగా ఈక్విటీ వ్యాల్యూయేషన్లు ఖరీదుగా మారాయని భావించి సందర్భాల్లో ఈక్విటీ కేటాయింపులను 65 శాతానికి పరిమితం చేసి, మిగిలిన మేర డెట్‌ సాధనాలకు మళ్లిస్తుంటాయి. ఇలా పరిస్థితులకు తగినట్టు మార్పులు చేస్తూ అధిక రాబడులు తెచి్చపెట్టే విధంగా ఈ పథకాలు పనిచేస్తాయి. మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేస్తుంటాయి. ఈ తరహా పెట్టుబడుల వ్యూహాలను ఈ పథకంలో గమనించొచ్చు.  

పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.10,372 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 71 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌లో 25.58 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. మరో 3.29 శాతం పెట్టుబడులను నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో అనిశ్చితుల నేపథ్యంలో కొంత నగదు నిల్వలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పోర్ట్‌ఫోలియోలో 64 స్టాక్స్‌ను కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 77 శాతం మేర కేటాయింపులు మెగా, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 19.78 శాతం ఉంటే, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 3 శాతం పెట్టుబడులు ఉన్నాయి.

 డెట్‌లో రిస్క్‌ అత్యంత కనిష్టంగా ఉండే ఏఏఏ రేటెడ్, ఎస్‌వోవీల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. ఈక్విటీ పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిల్లో 25 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 8.99 శాతం, ఇండ్రస్టియల్‌ కంపెనీలకు 8.28 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రీషినరీ కంపెనీలకు 6.55 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement