మలేరియా వ్యాధి నియంత్రణకు ప్రపంచంలోనే మొదటి టీకా అయిన ఆర్టీఎస్,ఎస్/ఏఎస్01 ధరను సుమారు 40 శాతం తగ్గించే ఒప్పందాన్ని భారత్ బయోటెక్ ప్రకటించింది. గవి, ది వ్యాక్సిన్ అలయన్స్, యునిసెఫ్లతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా 2027 నుంచి 2029 వరకు పిల్లల టీకా కార్యక్రమాలకు సుమారు 5 కోట్ల అమెరికన్ డాలర్ల ఆదా అవుతుందని, పూర్తి నాలుగు మోతాదుల టీకా కోర్సుతో మరో 10 లక్షల మంది పిల్లలను రక్షించవచ్చని కంపెనీ తెలిపింది.
యునిసెఫ్ అమలు చేసే, గవి ఆర్థిక సహకారం అందించే ఈ ఒప్పందం ప్రకారం టీకా ధర ఒక్కో మోతాదుకు 5.50 యూరోలకు చేరుతుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరతో పోలిస్తే ఇది సుమారు 40 శాతం తగ్గుదల. ఈ కొత్త ధర 2027 ప్రారంభం నాటికి అమల్లోకి రానుందని ప్రకటనలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సౌకర్య సంస్థ ఐఎఫ్ఎఫ్ఐఎం ముందస్తు చెల్లింపు ద్వారా ఈ ఒప్పందాన్ని సాధ్యం చేశారు. మలేరియా టీకాల మార్కెట్‌ను మరింత స్థిరంగా, పోటీపరంగా మార్చడానికి చేసిన నిరంతర ప్రయత్నాలకు ఇది ఫలితమని భారత్ బయోటెక్ వివరించింది.
జీఎస్కే అభివృద్ధి చేసిన ఆర్టీఎస్,ఎస్/ఏఎస్01 టీకాను భారత్ బయోటెక్ ‘మోస్కివాక్’ పేరుతో తయారు చేస్తోంది. జీఎస్కే, పాత్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ టీకాకు 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన మొదటి మలేరియా టీకాగా గుర్తింపు లభించింది.


