ఎఫ్‌జీడీ ఎప్పుడు పూర్తయ్యేనో..? | Sakshi
Sakshi News home page

ఎఫ్‌జీడీ ఎప్పుడు పూర్తయ్యేనో..?

Published Sat, Apr 20 2024 12:10 AM

కేటీపీఎస్‌లో నిలిచిన ఎఫ్‌జీడీ నిర్మాణ పనులు - Sakshi

● రాష్ట్రంలో తొలిసారి కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్‌ ● రూ.300 కోట్లతో ఏడాదిన్నర క్రితం మొదలు పెట్టిన బీహెచ్‌ఈఎల్‌ ● పనులు పూర్తిగా నిలిచిపోయినా పట్టించుకోని జెన్‌కో అధికారులు

పాల్వంచ: పాల్వంచలోని సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ కలిగిన కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారానికి అనుసంధానంగా నిర్మిస్తున్న కాలుష్య నియంత్రణ ప్లాంట్‌( ఫ్లూ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌–ఎఫ్‌జీడీ) పనులు ముందుకు సాగడం లేదు. విద్యుత్‌ కర్మాగారం పూర్తయిన మూడేళ్లకు రూ.300 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. బీహెచ్‌ఈఎల్‌ సంస్థ కాంట్రాక్ట్‌ దక్కించుకోగా, ఏడాదిన్నర గడిచినా పనులు చురుగ్గా సాగడంలేదు. పనులకు సంబంధించిన డ్రాయింగ్‌ ఇంకా రాలేదనే సాకుతో మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. బీహెచ్‌ఈఎల్‌ నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆర్‌వీపీఆర్‌ కంపెనీ.. కార్మికులకు గత నాలుగు నెలలుగా ఇవ్వలేదు. దీంతో అక్కడ పనిచేసే సుమారు 32 మంది ఈ నెల 1 నుంచి పనులు నిలిపివేశారు. ఇటీవల ప్లాంట్‌ నిర్మాణ పనుల ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. అయితే బిల్లులు రాకపోవడంతో వేతనాలు చెల్లించలేదని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు.

తొలిసారిగా కేటీపీఎస్‌లోనే..

కొత్తగా నిర్మించే కర్మాగారాలకు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్‌ సెంట్రల్‌ బోర్డు ఎఫ్‌జీడీ ప్లాంట్‌ ఏర్పాటు తప్పనిసరి చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా కేటీపీఎస్‌లో ఈ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్‌, (1080 మెగావాట్లు), నల్లగొండ జిలా దామరచర్ల వద్ద యాదాద్రి పవర్‌ ప్లాంట్‌(4వేల మెగావాట్లు) వద్ద కూడా ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నిర్మించాల్సి ఉంది. కేటీపీఎస్‌ 7వ దశ(800 మెగావాట్లు) నిర్మాణ పనులు పూర్తై 2018 డిసెంబర్‌లో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చింది. పక్కన ఉన్న, ఆరు దశాబ్దాలుగా సిబ్బంది నివసిస్తున్న సెక్యూరిటీ కాలనీని ఖాళీ చేయించి ఐదెకరాల స్థలాన్ని ఎఫ్‌జీడీ ప్లాంట్‌కు కేటాయించారు.

పట్టించుకోని జెన్‌కో ఉన్నతాధికారులు

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గును మండిస్తే అధిక కాలుష్యం వెలువడుతుంది. పొగలో హానికర సల్ఫర్‌ వాయువు నార్మల్‌ మీటర్‌ క్యూబ్‌ 50 మిల్లీ గ్రామ్స్‌కు మించకుండా ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో నివారించవచ్చు. ఈ ప్లాంట్‌ లేకపోతే భవిష్యత్‌లో విద్యుదుత్పత్తి కర్మాగారాలకు అనుమతులను రద్దు చేస్తారు. కేటీపీఎస్‌ ఏడో దశ ప్రారంభించి ప్రారంభించి ఐదేళ్లు కావొస్తోంది. దీంతో తీవ్ర కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు జెన్‌కో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపంతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఇంకా డ్రాయింగ్‌ రాలేదని, వచ్చినా పూర్తి ఆమోదం తెలపాలంటూ మూడు నెలలుగా పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చివరకు పనులు ఆగిపోయినా జెన్‌కో అధికారుల్లో మాత్రం చలనం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాలుగు చోట్ల ఏఏక్యూఎం స్టేషన్లు..

ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నిర్మాణం అనంతరం కాలుష్యం అంచనాకు అంబియాస్ట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ (ఏఏక్యూఎం) స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్లాంట్‌కు నాలుగు వైపులా నాలుగు మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో పాత ప్రాజెక్ట్‌ హాస్టల్‌ వద్ద, బస్టాండ్‌ ముందు జెన్‌కో కాలనీలో, 7వ దశ కర్మాగారంలో, కరకవాగు లేదా పునుకులలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా స్టేషన్ల ద్వారా గాలిలో కాలుష్యాన్ని అంచనా వేసి, అక్కడి అధికారులతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌లో ఉండే పొల్యుషన్‌ బోర్డు అధికారులు కూడా మానిటరింగ్‌ చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో రెండేళ్లయినా పడుతుందనే వాదనలు ఉన్నాయి. ఈ విషయమై 7వ దశ సీఈ పి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. ఎస్‌ఈ(సివిల్‌) ఎస్‌.యుగపతిని వివరణ కోరగా.. ఇంకా డ్రాయింగ్‌ రాకపోవడంతో పనులు కొంత ఆగాయని తెలిపారు. కాంట్రాక్ట్‌ కంపెనీ కూడా వేతనాలు ఇవ్వక కార్మికులు పనుల్లోకి రావడం లేదని తెలిసిందని, దీనిపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టిలో ఉన్నాయని వివరించారు.

ఇటీవల ప్లాంట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన కార్మికులు (ఫైల్‌)
1/1

ఇటీవల ప్లాంట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన కార్మికులు (ఫైల్‌)

Advertisement
Advertisement