ఏటికి ఎదురీత | Sakshi
Sakshi News home page

ఏటికి ఎదురీత

Published Wed, Nov 22 2023 12:26 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మరోసారి ఏటికి ఎదురీదుతున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం అండగా ఉన్నా.. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇటు ప్రధాన పార్టీల తరఫున, అటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం వెంకటరావుకు ఉంది. గతంలో రెండుసార్లు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఒకసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి అటు ప్రధాన పార్టీల తరఫున కాకుండా, ఇటు ఇండిపెండెంట్‌గా కాకుండా అనూహ్యంగా జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో గత చరిత్ర పునరావృతం అవుతుందా? లేక గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తారా ? అనే చర్చ కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.

మళ్లీ వనమాకే టికెట్‌ ..

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో కారు గుర్తుపై పోటీ చేసిన వెంకటరావు ఓడిపోయారు. అనంతరం వనమా బీఆర్‌ఎస్‌లో చేరడంతో ‘గూడెం’ గులాబీ వనంలో కొత్త జగడం మొదలైంది. అప్పటికే వనమా ఎన్నిక చెల్ల దంటూ హైకోర్టులో జలగం కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గాలని బీఆర్‌ఎస్‌ పెద్దలు చేసిన సూచనను ఆయన లెక్క చేయలేదు. దీంతో క్రమంగా కారు పార్టీతో దూరం పెరుగుతూ వచ్చింది. మరోవైపు అనర్హత కేసు విషయమై సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడలేదు. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో బీఆర్‌ఎస్‌ వనమాకే టికెట్‌ కేటాయించింది. దీంతో జలగం వెంకటరావు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున చివరి రోజున నామినేషన్‌ దాఖలు చేశారు.

2004 నుంచి వెంకటరావు ప్రస్థానం..

జలగం వెంకటరావు రాజకీయ ప్రస్థానం 2004లో మొదలైంది. అప్పట్లో జిల్లా రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే ఆ తర్వాత ఎన్నికల సమయానికి సత్తుపల్లి సీటు ఎస్సీకి రిజర్వ్‌ అయింది. జనరల్‌ స్థానమైన ఖమ్మం నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపించగా కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం జలగంపై కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. తదనంతర పరిణామాల్లో ఆయన వైఎస్సార్‌సీపీ మీదుగా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి కొత్తగూడెం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 2018లో వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి తర్వాత ఆయన రాజకీయ జీవితంలో మరోసారి ట్విస్టులు మొదలయ్యాయి.

జలగం కుటుంబంలో ఎత్తుపల్లాలు..

గతంలోనూ ప్రధాన పార్టీలను విబేధించి రాజకీయాలు చేసిన చరిత్ర జలగం కుటుంబానికి ఉంది. 1952లో జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావుకు అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వం వేంసూరు నుంచి టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పార్టీ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆ తర్వాత కాలంలో తిరిగి పార్టీలో చేరి కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు పొందారు. జలగం ప్రసాదరావు 1999లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌ వైపు ఆయన చూసింది లేదు. తాజాగా వెంకటరావు రాజకీయ ప్రయాణంలోనూ ఇదే తరహా ఎత్తు పల్లాలు ఎదురవుతున్నాయి.

ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో జలగం

గతంలో ఖమ్మం నుంచి పోటీ.. తృటిలో చేజారిన విజయం

సింహం గర్జించేనా.. విజయం వరించేనా ?

‘సింహం’ గర్జించేనా..

70 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జలగం కుటుంబానికి గెలుపోటములు కొత్త కాదు. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి జలగం వెంకటరావు ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నమైన శైలి వెంకటరావుది. ఎక్కువ మాట్లాడరు, ప్రజల్లో పెద్దగా కలిసిపోరనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇదే సమయంలో విజన్‌ ఉన్న లీడర్‌గానూ గుర్తింపు ఉంది. టూరిస్టు పొలిటీషియన్‌ అంటూ ప్రత్యర్థులు ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండగా, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండని జలగం అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఆయన ఎన్నికల గుర్తయిన సింహం గర్జిస్తుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement