వర్షాధారం..నాణ్యతే ప్రామాణికం | Sakshi
Sakshi News home page

వర్షాధారం..నాణ్యతే ప్రామాణికం

Published Sat, May 25 2024 4:45 PM

వర్షాధారం..నాణ్యతే ప్రామాణికం

సాక్షి రాయచోటి/పీలేరు రూరల్‌ : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అందించే సబ్సిడీ వేరుశనగ కాయలు నాణ్యమైనవి అందిస్తేనే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా సబ్సిడీ..లొట్టలతోపాటు నాసిరకం అందిస్తే పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఏడాదిలో వర్షాధారం కింద సాగు చేసే అన్నదాతలకు ప్రతి ఏడాది వ్యవసాయశాఖ ఖరీఫ్‌లో సబ్సిడీపై విత్తనాలను అందించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ముందస్తుగా కొనుగోలు చేసి నాణ్యత కలిగిన కాయలను ఎంపిక చేసి రైతులకు అందించేవారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన ఎక్కడికక్కడే రైతులు, గోడౌన్ల వద్ద కొనుగోలు చేసి అందించే వేరుశనగ కాయలలో నాణ్యత ఉండదని రైతులు పెదవి విరుస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు సబ్సిడీ వేరుశనగ కాయలు 55,383 క్వింటాళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు మండలాల వారీగా పంపిణీకి వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమే అలస్యం, వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆర్బీకేల ద్వారా అవసరమైన రైతులు రిజిస్టర్‌ చేసుకోవాలని పిలుపునిచ్చిన తరుణంలో పెద్ద ఎత్తున రైతులు నమోదు చేసుకుంటున్నారు.

● జిల్లాలో రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ కాయల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ముందుగా విత్తన మొలకశాతంతోపాటు విత్తన పరిపుష్టి శాతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అందించాలని ఏపీ సీడ్స్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. ఏడాదికి ఒకసారి వర్షాభావం కింద సాగు చేసే పంట కావడంతో ఏదైనా తేడా వస్తే నష్టపోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు.

నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదు: జేడీ

రైతులకు సంబంధించి అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల విషయంలో ఖచ్చితంగా నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రనాయక్‌ తెలియజేశారు. 74 శాతం అవుటన్‌ ఉంటేనే పాయింట్ల నుంచి విత్తనాలను తెస్తున్నామని తెలియజేశారు. ఏపీ సీడ్స్‌ ద్వారా జిల్లాలో ఆరు చోట్ల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయని, అక్కడ తయారైన విత్తనాలను నాణ్యత, అవుటన్‌ పరిశీలించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. నాణ్యత విషయంలో కఠినంగా ఉన్నామని, అలాంటి లాట్లతో బస్తాలు వచ్చినా వెంటనే వెనక్కి పంపుతాము తప్ప తీసుకోమన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) కూడా 10 మంది రైతులతో ఒక క్వాలిటీ టీం ఏర్పాటు చేశామని...దీంతో తేడా రాదన్నారు. ఒకవేళ ఏదైనా నాణ్యత విషయంలో తేడా వస్తే ఆర్బీకే అసిస్టెంట్‌, ఏఓ, ఏడీఏలపై చర్యలు తప్పవని ఆయన సాక్షికి తెలియజేశారు.

పీలేరు ఎమ్మెల్యేను కలిసిన రైతులు

ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఏపీ సీడ్స్‌ ద్వారా అందిస్తున్న విత్తనాల విషయంలో నాణ్యత అనుమానాలు రావడంతో పలువురు రైతులు శుక్రవారం పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఏపీ విత్తన అభివృద్ధి సంస్థ మేనేజర్‌, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఈ ప్రాంతంలో పండిన విత్తనాలు కొనుగోలు చేసి అవే తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వేరే ప్రాంతాల్లో అధిక దిగుబడులు వచ్చిన విత్తనకాయలు కొనుగోలు చేసి, అలాంటివి ఇవ్వాలని, దీంతో మంచి దిగుబడి వచ్చి రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని అదికారులకు వివరించారు.

నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి పెంపు

అత్యుత్తమ విత్తనాలను అందించాలని అన్నదాతల డిమాండ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement