ప్రాణాలైనా ఇస్తా.. పోరాటం ఆపను | YSRCP State General Secretary Gadikota Srikanth Reddy on attacks on ysrcp | Sakshi
Sakshi News home page

ప్రాణాలైనా ఇస్తా.. పోరాటం ఆపను

Oct 17 2026 4:46 AM | Updated on Oct 17 2026 4:46 AM

YSRCP State General Secretary Gadikota Srikanth Reddy on attacks on ysrcp

దాడులతో మమ్మల్ని భయపెట్టలేరు

ప్రజలకు దేవాలయం వంటి వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం దారుణం

జిల్లా కేంద్రం విషయంలో లేని ప్రతిష్ట ఎన్నికల్లోనే ఎందుకు?

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

రాయచోటి అర్బన్‌ : వెన్నుపోటు పార్టీ కూటమి గూండాల దాడులకు భయపడబోమని, ప్రాణాలైనా ఇస్తా కానీ అధికార కూటమి అరాచకాలపై పోరాటం ఆపనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేసి, నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యాలయం కేవలం ఒక భవనం కాదని, ప్రజల సమస్యలు వినిపించే ప్రజాభవన్‌ అని, ప్రతి సామాన్యుడిని ఆదరించే దేవాలయమని, అలాంటి కార్యాలయానికి పచ్చమూకలు నిప్పు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఈ దాడుల్లో తన అనుచరులకు చెందిన దాదాపు 30 వాహనాలకు కూడా నిప్పుపెట్టారని, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేసి, ఆ ఘటనను తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. అధికార పార్టీకి నిజంగా ధైర్యం, దమ్ము, రాజకీయ ప్రతిష్ట ఉంటే నిష్పక్షపాతంగా పోలింగ్‌ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. అందులో వారు విజయం సాధిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలోనే ప్రతిష్ఠ గుర్తుకువస్తుందా?
ఈ ఎన్నికలు ప్రతిష్ట అంటూ మున్సిపాలిటీ పరిధిలోని 44 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న అధికార పార్టీ మంత్రి, పెద్దలు.. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రతిష్ట గుర్తుకు వస్తుందా అని నిలదీశారు. 

సామాన్య ప్రజలను, బలహీన వర్గాలను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటివి పిరికిపంద చర్యలు అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటివని మండిపడ్డారు. దమ్ముంటే తనతో నేరుగా తలపడాలని సవాల్‌ విసిరారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఒకరిద్దరు వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయచోటి మున్సిపాలిటీలో స్వేచ్ఛాయుతంగా , నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement