నామినేషన్లు అడ్డుకోవడం.. ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడే | YS Jagan lashes out at Chandrababu over attacks on YSRCP candidates | Sakshi
Sakshi News home page

నామినేషన్లు అడ్డుకోవడం.. ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడే

Oct 17 2026 4:40 AM | Updated on Oct 17 2026 5:11 AM

YS Jagan lashes out at Chandrababu over attacks on YSRCP candidates

సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నిప్పులు 

ప్రభుత్వ యంత్రాంగం నీ పార్టీ సొంత ఆస్తి కాదు బాబూ..

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయం, వాహనాలకు నిప్పు

తిరుపతి, ధర్మవరం, కడపలో నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేత

దాచేపల్లిలో మా అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా నిర్బంధం

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర బలగాలతో నిర్వహించాలి

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం క్రూరంగా చేసిన దాడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని  మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులకు దిగడంతోపాటు హత్య చేస్తామని బెదిరిస్తూ చివరకు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. వాహనాలకు నిప్పుపెట్టడం.. నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేయడం లాంటి ఘటనలు జరుగుతున్నా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ధ్వజమెత్తారు. కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాల్లో భాగస్వాములుగా కూడా మారారని, తమ విధులు నిర్వర్తించని పోలీసులు చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఎంపీకే రక్షణ కల్పించకపోతే...ఇక సామాన్యుల గతేమిటి?
రాజంపేట ఎంపీ, లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై పుంగనూరులో జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన ఆయన వాహన శ్రేణిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కూడా గాయపరిచారు. వాహనాలను ధ్వంసం చేశారు. 

మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం ప్రాంగణంలోనే పోలీసుల కళ్లెదుట ఇదంతా జరిగింది. ఇంత జరిగినా తర్వాత కూడా మా అభ్యర్థులను మూడు గంటలకుపైగా వేచి ఉంచిన అధికారులు వారి నామినేషన్‌ పత్రాలను మాత్రం స్వీకరించలేదు. లోక్‌సభలో మా పార్టీ పక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ఆశించగలం?

రాయచోటిలో భయోత్పాతం సృష్టించారు..
రాయచోటిలో మా అభ్యర్థులను నామినేషన్లు వేయవద్దంటూ బెదిరించారు. ఆ బెదిరింపులను లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో టీడీపీ గూండాలు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై దాడి చేశారు. పార్టీ కార్యాలయానికి, వాహనాలకు నిప్పుపెట్టి మా కార్యకర్తలను గాయపరిచారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్‌ పత్రాల తయారీ కోసం మా పార్టీ కార్యాలయంలో సమావేశమైన కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మా పార్టీ కార్యాలయానికి నిప్పు పెడుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు.

పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులపై దాడులు
తిరుపతిలో మా పార్టీ మహిళా అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. మా నాయకులపై దాడులు చేశారు. ధర్మవరంలో పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. కడపలో 30వ డివిజన్‌ అభ్యర్థిని అడ్డుకోవడమే కాకుండా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన నామినేషన్‌ పత్రాలను కూడా లాక్కుని చించివేశారు. అయినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పోలీసుల ఈ సిగ్గుమాలిన నిర్వాకంతో టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తెగబడుతున్నాయి. దాచేపల్లిలో మా నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి వాహనంలో మద్యం సీసాలు పెట్టి ఆయనను నామినేషన్‌ వేయకుండా నిర్బంధించారు. 

ప్రభుత్వ యంత్రాంగం బాబు సొంత ఆస్తి కాదు..
ప్రభుత్వ యంత్రాంగం తన పార్టీ సొంత ఆస్తి కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. ఇలా హింస, దౌర్జన్యాలతో ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని టీడీపీ తిరిగి పొందలేదు. ఇలాంటి ప్రతి దాడి... ప్రజల పక్షాన నిలబడి వారి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలన్న మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

బెదిరింపులకు లొంగేది లేదు..
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలందరికీ నేను అండగా నిలబడతా. బెదిరింపులకు లొంగేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని వీడే ప్రసక్తే లేదు. ప్రతి ఘ­టనపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేయాలి. ఈ హింసకు సహకరించిన ప్రతి అధికారిని జవాబుదారీగా నిలబెట్టాలి.

అభ్యర్థులకు రక్షణ కల్పించాలి..
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తక్షణమే జోక్యం చేసుకోవాలి. దాడులు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి. కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికల్లో భద్రత కల్పించాలి. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోటీ చేసే పరిస్థితులు ఉండాలి. ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే వాతావరణం కల్పించాలి.

ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలి..
నామినేషన్ల దాఖలుకు కేంద్రీకృత విధానాన్ని లేదా పారదర్శకమైన, సురక్షితమైన ఆన్‌లైన్‌ నామినేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసార ఫుటేజీ అందుబాటులో ఉంచాలి. బ్యాలెట్‌ బాక్సులను ట్యాంపరింగ్‌ చేయకుండా నిరోధించేందుకు అన్ని స్ట్రాంగ్‌ రూమ్‌లలో సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఉండాలి. అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌లోని సంతకాలను సక్రమంగా పరిశీలించడంతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించాలి. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పారా మిలిటరీ బలగాలను రప్పించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement