‘ఎస్ఈసీపై సుప్రీంకోర్టుకు వెళతాం’ | Vidadala Rajini criticized Chandrababu government | Sakshi
Sakshi News home page

‘ఎస్ఈసీపై సుప్రీంకోర్టుకు వెళతాం’

Oct 22 2026 7:51 PM | Updated on Oct 22 2026 8:05 PM

Vidadala Rajini criticized Chandrababu government

సాక్షి,గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై దాడులు చేస్తుంటే, ఇళ్లలోకి దూరి మరీ అభ్యర్ధుల్ని లాక్కొచ్చి నామినేషన్లు విత్ డ్రా చేయిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత విడదల రజిని తీవ్రంగా మండిపడ్డారు. చిలకలూరిపేటలో టీడీపీ దాడులకు దిగుతుంటే, బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేయిస్తుంటే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని ఆక్షేపించారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు విత్ డ్రా చేయించిన వ్యవహారంపై ఎస్ఈసీని కలిసి ఆధారాలు సమర్పించామని, దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి న్యాయం కోరతామని విడదల రజిని హెచ్చరించారు. ప్రెస్ మీట్లో విడదల రజినీ ఇంకా ఏమన్నారంటే...

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఈ రెడ్ బుక్ ఎలెక్షన్ అజెండా ఒక్కటే. కూటమి అభ్యర్ధులు పోటీ కూడా పడకుండానే, వాళ్లే సుప్రీం అనుకుని, వాళ్లకే ఏకగ్రీవం కావాలని, వాళ్లే గెలిచినట్లు డిక్లరేషన్ చేసుకోవడమే ఈ రెడ్ బుక్ ఎలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విపక్ష అభ్యర్ధులు నామినేషన్లను అడ్డుకోవడం, వాళ్ల కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని వేధిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, దాడులు  చేస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మా నాయకుడు వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో పోటీ చేయాలని ముందుకొస్తున్న వారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. అందుకే వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం.

ఎంపీటీసీ,జడ్పీటీసీ నామినేషన్లు ప్రారంభమయ్యాక కూడా అధికారులు వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఎక్కడా ఎన్వోసీలు ఇవ్వకుండా సాకులు చెప్తూ వచ్చారు.చివరికి ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గారు. ఎన్వోసీల  అడ్డంకులు తప్పాయి నామినేషన్ వేద్దామని అనుకుంటే, మండల కేంద్రాల్లో నామినేషన్ కేంద్రాలకు దగ్గరగా బ్యారికేడ్లు పెట్టి, అక్కడ 400-500 మంది టీడీపీ వాళ్లు, పోలీసులు ఉంటారు. పోలీసులు ఉన్నారు కదా సవ్యంగా నామినేషన్లు వేసుకునేలా చూస్తారా అంటే అదీ లేదు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై దౌర్జన్యాలు చేయడానికి, వాళ్ల తలలు పగులగొట్టడానికి, చంపడానికి ప్రయత్నిస్తున్న పరిస్ధితులు ఉన్నయి. ఇవాళ నా నియోజకవర్గంలోని నాదెండ్ల మండలంలో నామినేషన్ వేయానుకున్న అభ్యర్ధులనూ, నాయకులనూ కారణం చెప్పకుండానే పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి బంధించారు. ఎడ్లపాడులో మా నాయకులు నామినేషన్లు వేయాలని బయటికి వస్తే వాళ్లను టీడీపీ వాళ్లు అడ్డుకుని, గూండాయిజం, రౌజీయిజం చేస్తూ పోలీసుల సమక్షంలోనే అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఇరువర్గాల వారిని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టామని చెప్పుకుంటూ పోలీసులు డ్రామాలు ఆడుతున్నారు.

అర్ధరాత్రి 12 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణా ?
పోలీసులు ఎక్కడ కూడా అభ్యర్ధులతో స్వేచ్ఛగా నామినేషన్లు వేయించాలని, గొడవలు నివారిద్దామని అనుకోవడం లేదు. అంటే అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా టీడీపీ వాళ్లు గూండాలు, రౌడీల మాదిరిగా నామినేషన్లు వేయాలనుకున్న వైఎస్సార్సీపీ వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. అందుకే ఎడ్లపాడులో మహిళలు హైవే ఎక్కి నామినేషన్ వేసేందుకు అనుమతించాలని పోలీసుల ముందు నిరసనకు దిగాల్సిన పరిస్ధితిని అందరూ చూశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను వీళ్లు అడ్డుకుంటుంటే ఎస్ఈసీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. ఈసీ రూల్స్ ఎవరూ పాటించడం లేదు.

2019లో వైఎస్‌ జగన్‌  అధికారంలోకి వచ్చాక నిర్వహించిన స్థానిక ఎన్నికల్ని ఎంతో పద్దతిగా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు ఎక్కడా కనిపించడం  లేదు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 3 గంటలకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగిసింది. కానీ మా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ విత్ డ్రా ప్రక్రియ కొనసాగింది. ఇందుకు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులే సాక్ష్యం. ఏంటీ అన్యాయమని ప్రతీ ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీగా ఎన్నికలు జరిపిస్తే చిలకలూరిపేటలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టండి.

 ఎస్ఈసీ ఇందులో జోక్యం చేసుకోవాలని ఇవాళ ఫిర్యాదు చేశాను. ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎస్ఈసీ రాత్రి 10 గంటలకు ప్రకటించినా అది కూడా లెక్కచేయకుండా రాత్రి 12 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగించారు. చంపుతామని బెదిరించి, కొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, ఉద్యోగాలు, ఆస్తుల విషయంలో అంతు తేలుస్తామని బెదిరించి, కిడ్నాప్ లు చేసి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. నైట్ డ్రెస్ లో ఉన్న మహిళను సైతం డ్రెస్ మార్చుకుని వస్తామని చెప్పినా టీడీపీ గూండాలు ఎత్తుకొచ్చి రాత్రి 11 గంటలకు ఆమెతో నామినేషన్ ఉపసంహరింపజేశారు. రాత్రి 12 గంటల వరకూ అధికారులు ఎందుకు పనిచేశారో చెప్పాలి.

ఎస్ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం తప్పదు
టీడీపీకి ధైర్యం, నిజాయితీ ఉంటే ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ధైర్యముంటే ప్రజల్లోకి రండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మేమేం చెప్పాలో చెప్తాం, వాళ్లే అన్నీ నిర్ణయిస్తారు. అలా కాకుండా నీచమైన, దుర్మార్గమైన పనులకు దిగుతున్నారంటే చిలకలూరిపేటలో ఓడిపోతామన్న భయం మీలో కనిపించింది.  మహిళలని కూడా లెక్కచేయకుండా ఇలాంటి దాడులకు దిగుతున్నారంటే రెడ్ బుక్ ఎన్నికల అజెండా ఎలా ఉందో అర్దమవుతోంది. ఒకరిని మించి మరొకరు ఇందులో పోటీ పడుతున్నారు. ఒకరు నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే, మరొకరు ప్రత్యర్దుల్ని ఇంటిలో నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోటీ పడుతున్నారు. ఇలా ఒకరిని మించి మరొకరు ఎన్నికల్లో ఇన్ని విధాలుగా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇదంతా కరెక్టేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.

దీనిపై ఇవాళ చిలకలూరిపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన దారుణాలు, దాడులు, బెదిరింపులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాను. 12 గంటల వరకూ ఎలా నామినేషన్లు విత్ డ్రా చేయించారో కూడా ఆధారాలు, వీడియోలను సమర్పించి తగిన చర్యలు తీసుకోవాలని కోరాను. అలాగే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ సీసీటీవీ ఫుటేజ్ ను ఫ్రీజ్ చేయమని కూడా కోరాను. దీనికి సంబంధించి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించాం. ఇవన్నీ అధ్యయనం చేసి వెంటనే ఈ ఎన్నికల్ని రీషెడ్యూల్ చేయమని కోరాం. ఎస్ఈసీ మాకు కచ్చితంగా న్యాయం చేయకపోతే వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టు వరకూ వెళ్తాం, ఎన్నికల్లో ఎవరైతే అత్యుత్సాహం చూపించారో వారిని శిక్షించే వరకూ వదిలిపెట్టం. వైఎస్సార్సీపీని ఎంత అణగదొక్కినా, ప్రజలు సరైన సమయం చూసి మీకు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం. టెక్నికల్‌గా వీళ్లు గెలిచినా, నైతికంగా వైఎస్సార్సీపీయే గెలువబోతోందని విడదల రజిని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి : సుప్రీం ఆదేశాలు..ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement